అమరావతి: ఆంధ్రప్రదేశ్‌తో పాటు యావత్ దేశంలో చర్చనీయాంశంగా మారిన తిరుపతి లడ్డూ కల్తీ ఇష్యూపై ప్రధాని మోడీకి వైసీపీ అధినేత జగన్ లేఖ రాశారు. టీటీడీ లడ్డూ తయారీపై సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణల్లో నిజానిజాలు వెలికి తీయాలని లేఖలో కోరారు. ఈ వ్యవహారాన్ని జాగ్రత్తగా చూడకపోతే పరిస్థితులు దిగజారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసిన జగన్.. చంద్రబాబు పాలనా సమర్థతపై ప్రజలు నమ్మకాన్ని కోల్పోయారని అన్నారు. చంద్రబాబు 100 రోజుల పాలన వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి పచ్చి అబద్ధాలను ప్రచారం చేశారని, దీంట్లో భాగంగానే తిరుమల లడ్డూ తయారీలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని ఆరోపణలు చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ALSO READ | అంతా చంద్రబాబు కట్టు కథ.. తిరుమల లడ్డు వివాదంపై స్పందించిన జగన్
రాజకీయ ఉద్దేశాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ఈ ప్రచారం చేశారని.. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బ తిన్నాయన్నారు. కొన్ని దశాబ్దాలుగా టీటీడీలో ధృఢమైన విధానాలు, పద్ధతులు ఉన్నాయి. అలాంటి టీటీడీ గొప్పతనాన్ని చెప్పాల్సింది పోయి చంద్రబాబు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని, పరీక్షల్లో కచ్చితత్వంపై నిర్ధారణ లేకుండా చంద్రబాబు దిగ్భ్రాంతి కలిగించే ఆరోపణలు చేశారని ఫైర్ అయ్యారు. టీడీపీ కార్యాలయంలో నెయ్యికి సంబంధించిన ల్యాబ్ నివేదికలు విడుదల చేశారని.. ప్రభుత్వం వద్ద ఉండాల్సిన రిపోర్టులు టీడీపీ ఆఫీస్‌లోకి వెళ్లాయని ప్రశ్నించారు. చంద్రబాబునాయుడుది చిత్తశుద్ధి లేని, కపట వైఖరి అని, ముఖ్యమంత్రి స్థాయిని మాత్రమే కాకుండా ప్రజా జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరి స్థాయిని దిగజార్చాయని అన్నారు.
చంద్రబాబునాయుడును తీవ్రంగా మందలించాల్సిన అవసరం ఉందని, దీంతో పాటు నిజానిజాలను వెలుగులోకి తీసుకురావడం అత్యవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. చంద్రబాబునాయుడు సృష్టించిన అనుమానాలను నివృతి చేయాలని ప్రధాని కోరిన జగన్.. తిరుమల లడ్డూ పవిత్రతపై భక్తుల విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి ఇది సహాయ పడుతుందని పేర్కొన్నారు. కాగా, వైసీపీ ప్రభుత్వ హాయాంలో తిరుపతి లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యి కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు వ్యాఖ్యల నేపథ్యంలో తిరుపతి లడ్డూ వ్యవహరం ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో తిరుపతి లడ్యూ ఇష్యూపై మోడీకి జగన్ లేఖ రాసి చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కోరడం గమనార్హం.