చంద్రబాబు 52 రోజుల పాలనపై వైఎస్ఆర్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. తాడేపల్లిలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ఎటు వైపు వెళ్తుందో ప్రతీ ఒక్కరూ ఆలోచించుకోవాలని కోరారు. రాష్ట్రం పురోగతి వైపు వెళ్తుందా?.. రివర్స్ లో వెళ్తుందా? అని ప్రజలు పునరాలోచన చేయాలన్నారు.
రాష్ట్రంలో చంద్రబాబు సూచనలతోనే గత 52 రోజులుగా దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయని.. ఆస్తుల ధ్వంసం చేస్తూ అరాచక పాలన కొనసాగుతోందన్నారు. ప్రశ్నించే వాళ్లను అణచివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత విధ్వంస పాలన సాగుతుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని మండిపడ్డారు. పూర్తి స్థాయి బడ్జెట్ కూడా పెట్టలేని అధ్వానమైన స్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు.
ఇప్పడు చంద్రబాబు ప్రభుత్వం ఏడు నెలల ఓటాన్ బడ్జెట్ పెడుతోందన్నారు. పూర్థిస్థాయి బడ్జెట్ కూడా పెట్టే ధైర్యం లేదంటే రాష్ట్రంలో ఎంతటి దారుణమైన పాలనో సాగుతుందో అర్థం చేసుకోవాలన్నారు. కాగా పూర్తి బడ్జెట్ పెడితే చంద్రబాబు నాయుడు మోసపూరిత హామీలు ఏమైతే ఇచ్చారో వాటికి కేటాయింపులు చూపించాల్సిన అవసరం వస్తుందని.. ఆ తప్పును కప్పిపుచ్చుకోవాడినికే పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడం లేదన్నారు.
చంద్రబాబు అంటేనే వంచన, గోబెల్స్ ప్రచారం అన్నారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడవడం దగ్గరి నుంచి ప్రజల్ని మోసం చేయడం దాకా అన్నిట్లో చంద్రబాబు ఆరితేరారని చెప్పారు. ఇప్పుడు రాష్ట్రం క్లిష్టపరిస్థితుల్లో ఉందని చంద్రబాబుగ్యాంగ్ ప్రచారం చేస్తోందని.. రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం అయ్యిందని.. అందుకే పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టడం లేదని చంద్రబాబు అంటున్నారని.. అవన్నీ తప్పడు మాటలే అన్నారు.
ఎన్నికల సమయంలో 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెబుతూ సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారని... ఇప్పుడు అధికారం వచ్చాక సూపర్ సిక్స్ పథకాలకు బడ్జెట్ కేటాయించలేమని నాటకాలు ఆడుతున్నారని అన్నారు. గతంలో 14 లక్షల కోట్ల అప్పు అని చెప్పి.. గవర్నర్ ప్రసంగం వరకు వచ్చే సరికి రూ.10 లక్షల కోట్ల అప్పు అయ్యిందని చూపించారు. కావాలని శ్వేత పత్రాలతో మభ్య పెట్టే యత్నం చేస్తున్నారు. ఈ ఏడాది జూన్ దాకా రాష్ట్రానికి రూ.5 లక్షల 18 వేల కోట్ల రూపాయలు మాత్రమే అప్పుడు ఉండేదని.. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే అప్పులు మరో 23.63% పెరిగాయన్నారు.