జయంతికి, వర్ధంతికి తేడా తెలియని పప్పు లోకేశ్ : YS షర్మిల

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి లోకేష్ లపై విమర్శల వర్షం కురిపించారు వైసీపీ నేత షర్మిల. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు రాజోలు నియోజక వర్గంలో ఆమె  ప్రచారం నిర్వహించారు. గత ఎన్నికల సమయంలో జాబు రావాలంటే బాబు రావాలని  తప్పుడు హామీలు ఇచ్చి ఏపీ ప్రజలను మోసం చేశారని ఈ సందర్భంగా ఆమె అన్నారు.

కుటుంబంలో ప్రతీ ఒక్క నిరుద్యోగికి జాబు ఇప్పిస్తానన్న బాబు.. ప్రజలకు కాకుండా కేవలం తన కొడుకు లోకేష్ కే ఉద్యోగం ఇప్పించారన్నారు.  ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు శాఖలకు సంబంధించి అతనికి పదవులను కట్టబెట్టారన్నారు. కేవలం పుత్ర వాత్సల్యంతోనే చంద్రబాబు.. ఏ మాత్రం తెలివి లేని తన కొడుకును అందలం ఎక్కించి ప్రజల నెత్తిపై కూర్చోబెట్టారని ఆమె విమర్శించారు.

జయంతికి, వర్ధంతికి తేడా తెలియని పప్పు లోకేష్ అని విమర్శించారు షర్మిల. అలాంటి నాయకుడు ప్రజలను ఏం పాలిస్తాడు… అని షర్మిల ప్రశ్నించారు. ఏ ఎన్నిక లేకుండా పదవులను సంపాదించిన లోకేష్ ఈ సారి ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని  అన్నారు. అ, ఆ లు రానివాడికి అగ్రతాంబూలం ఎందుకని లోకేష్ ను ఉద్దేశించి అన్నారు.  చంద్రబాబు రెండు వేళ్లను ప్రజలకు చూపించడం ఆయన రెండు నాలుకల ధోరణికి అర్ధమని షర్మిల విమర్శించారు.

చంద్రబాబు, లోకేశ్ కలిసి ఐదేళ్లపాటు ఏపీని లూటీ చేశారనీ…. మాటిచ్చి తప్పడంలో చంద్రబాబును మించినోళ్లు లేరని విమర్శించారు. నాలుగేళ్లు బీజేపీతో కలిసుండి హోదా సాధించలేని బాబు.. ఇప్పుడు హోదా హోదా అంటూ దొంగ కన్నీళ్లు పెడుతున్నారని మండిపడ్డారు షర్మిల.