న్యాయం కోసం వివేకా ఆత్మ ఘోషిస్తుంది... షర్మిల 

జగన్ ను గద్దె దించుటమే లక్ష్యంగా ఏపీ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన షర్మిల జగన్ పై వరుస విమర్శలు చేస్తూ దూకుడు మీదున్నారు. కడప ఎంపీగా పోటీకి దిగిన షర్మిల ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసు ప్రధానంగా విమర్శలు చేస్తూ జగన్, అవినాష్ రెడ్డిలను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కడప జిల్లా పోరుమామిళ్లలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న షర్మిల జగన్, అవినాష్ లను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. హంతకులకు మళ్ళీ పట్టం కడుతుంటే చూస్తూ ఊరుకోవాలా, న్యాయం జరగకపోతే ఆవేశం రాదా అని అన్నారు.

న్యాయం కోసం వివేకా ఆత్మ ఘోషిస్తుందని అన్నారు షర్మిల.బాబాయిని చంపినా హంతకుడని తెలిసి కూడా మళ్ళీ సీటిచ్చారని, హత్యకేసులో నిందితులకు సీటు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో పదేళ్లుగా దారుణ పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ అవినాష్ రెడ్డి ఒక కిల్లర్ అని, ఎంపీగా స్టీల్ ప్లాంట్ కోసం ఏనాడైనా కష్టపడ్డాడా అని అన్నారు. జగన్ ఒక కుంభకర్ణుడని, నాలుగేళ్లు నిద్రపోయి ఇప్పుడు నిద్ర లేచాడని అన్నారు. సిద్ధం అంటూ హడావుడి చేస్తున్నారని దేనికి సిద్ధమని ప్రశ్నించారు. మధ్య నిషేధమని కల్తీ మద్యం అమ్మటానికి సిద్ధమా, ఉద్యోగాలిస్తామని చెప్పి మోసం చేయటానికి సిద్ధమా అని మండిపడ్డారు షర్మిల.