ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సీఎం జగన్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రేపల్లెలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న షర్మిల ఈ వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ ను తాగుబోతు అని తిట్టిన వ్యక్తి, అసెంబ్లీలో తిట్టి పోసిన బొత్స లాంటి వ్యక్తిని తండ్రి లాంటి వారు అంటున్నారని, ఇదే బొత్స జగన్ కు ఉరి శిక్ష వేయాలని అన్నారని గుర్తు చేశారు షర్మిల. బొత్స విజయమ్మను కూడా అవమానించారని అన్నారు. వైఎస్ ను తిట్టిన వాళ్లంతా ఇవాళ క్యాబినెట్లో ఉన్నారని, అలాంటి వారికే జగన్ పెద్దపీట వేస్తున్నారని అన్నారు. వాళ్లంతా తండ్రులు, అక్కలు, చెల్లెల్లు అయ్యారని మండిపడ్డారు.
Also Read:తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల ఎండ.. రాత్రులు కూడా వేడి గాలులు
నిజంగా జగన్ కోసం పని చేసిన వాళ్ళు, ఆయన కోసం పాదయాత్ర చేసిన వాళ్ళు, గొడ్డలిపోటుకు గురైన వాళ్ళు మాత్రం ఏమీ కారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపిలో వైఎస్ఆర్ లేరని, Y అంటే వైవీ సుబ్బారెడ్డి అని, S అంటే సాయిరెడ్డి అని, R అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అని ఎద్దేవా చేశారు. పదేళ్లలో రేపల్లెలో అభివృద్ధి జరిగిందా, ఏ వర్గానికి అయినా న్యాయం జరిగిందా అని ప్రశ్నించారు. జగన్ ఇచ్చిన చెక్ డ్యామ్ ల నిర్మాణం, 100పడకల ఆసుపత్రి, ఆక్వా రైతులకు ఆక్వా పార్క్, షిప్పింగ్ హార్బర్, ఇంటింటికీ కుళాయి కనెక్షన్ వంటి హామీల్లో ఏ ఒక్కటి నెరవేరలేదని అన్నారు షర్మిల.