కరీంనగర్ : తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు.. గంగుల కమలాకర్ ముదిరి రంగుల కమలాకర్ అయ్యాడని వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ప్రజా ప్రస్థాన యాత్రలో భాగంగా కరీంనగర్ టౌన్ సర్కిల్ వద్ద బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. గంగుల కరీంనగర్ కు డాన్ అయి కూర్చున్నాడని, గ్రానైట్, ఇసుక, గుట్కా మాఫియాతో పాటు భూకబ్జాలు చేసి డబ్బు సంపాదించడమే ఆయన సింగిల్ ఎజెండా అని అన్నారు. ఈడీ సోదాల్లో గంగుల నివాసంలో కట్టలు కట్టలుగా హవాలా సొమ్ము దొరికిందని వార్తలు వస్తున్నాయని షర్మిల చెప్పారు. గ్రానైట్ మైనింగ్ లో రూ.350 కోట్లు కేంద్రానికి బాకీ ఉన్నాడంటే ఆయన దోపిడీకి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుందని అన్నారు.
ఈడీ సోదాలు జరిపినా గంగుల అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విచారణ జరపడంలేదని షర్మిల ప్రశ్నించారు. పెద్ద దొర, చిన్న దొరకు కమిషన్ అందుతున్నందునే ఆయనపై కేసులు పెట్టడంలేదని విమర్శించారు. కరీం నగర్ లో గంగుల రౌడీ రాజ్యం నడుస్తోందని, న్యాయం, ధర్మం బ్రతికిలేవని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో ఎక్కడైనా డబ్బు, అధికార పిచ్చిని నయం చేసే ఆస్పత్రి ఉంటే గంగుల కమలాకర్ అందులో చూయించుకోవాలని షర్మిల సటైర్ వేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు రీ డిజైన్ పేరుతో లక్షల కోట్లు దోచుకున్నారని షర్మిల ఆరోపించారు. కరీంనగర్ జిల్లాను మోసం చేసిన మోసగాడు కేసీఆర్ అని విమర్శించారు. 8 ఏండ్లుగా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి జిల్లా కోసం చేసిందేమీ లేదని షర్మిల మండిపడ్డారు.