- కృష్ణారెడ్డి, కేసీఆర్ తోడు దొంగలు
- కాళేశ్వరంలో 70 వేల కోట్ల అవినీతి: షర్మిల
- మునుగోడులో ఎవరికీ మద్దతు ఇస్తలేమని వెల్లడి
హైదరాబాద్/భైంసా, వెలుగు: కాళేశ్వరం నేషనల్ స్కామ్ అని, ఇది 2జీ స్కామ్ కంటే పెద్దదని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల అన్నారు. దీనిపై కాగ్ కు ఫిర్యాదు చేశామని, త్వరలోనే విచారణ చేపడతామని కాగ్ డైరెక్టర్ హామీ ఇచ్చారని చెప్పారు. పాదయాత్రలో భాగంగా శనివారం నిర్మల్ జిల్లా భైంసాలో బహిరంగ సభలో, హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో మీడియా సమావేశంలో షర్మిల మాట్లాడారు. “సీఎం కేసీఆర్, మేఘా కృష్ణారెడ్డి తోడు దొంగలు. మేఘాకు రేవంత్ రెడ్డి, బండి సంజయ్ జీతగాళ్లు. వీళ్లద్దరినీ కృష్ణారెడ్డి కొన్నాడు. మీడియాను మేనేజ్ చేస్తున్నాడు. దేశంలోనే అతిపెద్ద స్కామ్ కాళేశ్వరంలో జరిగింది. ఈ ప్రాజెక్టులో రూ.70 వేల కోట్ల అవినీతి జరిగింది” అని ఆమె ఆరోపించారు. ‘‘మేఘా కృష్ణారెడ్డి నుంచి మాకు పెద్ద ఆఫర్ వచ్చింది. కానీ నేను వైఎస్సార్ బిడ్డను. అమ్ముడుపోయే దాన్ని కాదు” అని చెప్పారు. లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న కవితను కాపాడేందుకే కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారని విమర్శించారు.
మునుగోడులో కుక్కల కొట్లాట..
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 119 సీట్లలో పోటీ చేస్తామని, తాను పాలేరు నుంచి పోటీ చేస్తానని షర్మిల చెప్పారు. ముందస్తు ఎన్నికలు రావని, కేసీఆర్ కు అంత దమ్ము లేదని అన్నారు. మునుగోడులో జరుగుతున్నది కుక్కల కొట్లాట అని, ఇది ప్రజల కోసం వచ్చిన ఎన్నిక కాదని మండిపడ్డారు. ‘‘రూ.వెయ్యి కోట్లతో దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నిక తెలంగాణలో జరుగుతోంది. కొలాయి తిప్పితే నీళ్లు కాదు.. మద్యం ఏరులై పారుతోంది. ప్రజాప్రతినిధులు సంతల్లో పశువుల్లా అమ్ముడుపోతున్నారు” అని ఫైర్ అయ్యారు. తాము మునుగోడులో ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదని.. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిస్తున్నామని చెప్పారు.
బాసర ట్రిపుల్ ఐటీని భ్రష్టు పట్టించిన్రు..
బాసర ట్రిపుల్ ఐటీని కేసీఆర్ భ్రష్టు పట్టించారని షర్మిల మండిపడ్డారు. తమకు కనీస సౌలతులు కల్పించాలంటూ స్టూడెంట్లు ఆందోళన చేస్తే కేసీఆర్ పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. ‘‘దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు’’గా మంత్రి కేటీఆర్ ఇటీవల ట్రిపుల్ ఐటీకి వచ్చి హడావుడి చేసి వెళ్లారని విమర్శించారు. ‘‘కేసీఆర్ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ఆయనకు బీఆర్ఎస్ పార్టీ పెట్టడం ఒక్కటే చేతనైంది. అది రాజకీయ పార్టీ కాదు.. బార్ అండ్ రెస్టారెంట్ పార్టీ” అని షర్మిల విమర్శించారు.