చేతకాని ఎమ్మెల్యేలందరూ టీఆర్ఎస్ లోనే ఉన్నారు : షర్మిల

చేతకాని ఎమ్మెల్యేలందరూ టీఆర్ఎస్ లోనే ఉన్నారని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ప్రజాప్రస్ధానం యాత్ర పేరిట షర్మిల చేపట్టిన పాదయాత్ర నర్సంపేట నియోజకవర్గంలో 3500 కిలోమీటర్లకు చేరింది. ఈ సందర్భంగా తన తండ్రి వైఎస్సార్ నర్సంపేటకు ఏం చేశారో వివరించిన షర్మిల... స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పై విరుచుకుపడ్డారు.పేరులోనే పెద్ది..ఆయనది చిన్న బుద్ధి అని విమర్శించారు. ఈ నియోజకవర్గంలో రాళ్ల వాన పడి 20 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగితే ఆదుకొనే పరిస్థితి లేదన్నారు. 

15 రోజుల్లో పరిహారం ఇస్తానని చెప్పి సుదర్శన్ రెడ్డి మోసం చేశారని షర్మిల ఆరోపించారు. ప్రజలు గెలిపించారన్న  సోయి, కృతజ్ఞత  కూడా స్థానిక ఎమ్మెల్యేకు లేదన్నారు. అభివృద్ధి చేయని ఈ ఎమ్మెల్యే ఎందుకని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు కర్రు కాల్చి వాత పెట్టాలని ఓటర్లకు షర్మిల సూచించారు. అటు కేసీఆర్ ను నాయకుడు అనడం కంటే 420 అనడమే కరక్ట్ అన్న షర్మిల.. ప్రజలను నమ్మించి కేసీఆర్ మోసం చేశాడని ఆరోపించారు.