- కాళేశ్వరాన్ని రాష్ట్రానికి గుదిబండలా మార్చిండు
- రైతు బంధు పేరు చెప్పి సబ్సిడీలు బందుపెట్టిండు
కొత్త సీసాలో పాత సారా అన్నట్లు రాష్ట్ర బడ్జెట్ ఉందని వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. గతేడాది బడ్జెట్ను కాపీ పేస్ట్ చేసినట్లు ఈసారి పద్దులు ఉన్నాయని విమర్శించారు. కేటాయింపులకు, ఖర్చు చేస్తున్న నిధులకు అసలు పొంతనే లేదని షర్మిల వాపోయారు. ప్రజాప్రస్థాన యాత్రలో భాగంగా ధర్మసాగర్ లో ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో ఆమె మాట్లాడారు. సీఎం మాటలు కోటలు దాటుతాయే తప్ప చేతలు గడప దాటవన్న షర్మిల.. ఎనిమిదిన్నరేళ్లలో ప్రజలకిచ్చిన ఒక్క హామీని నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. అధికారం చేపట్టి ఇన్నేళ్లైనా దేవాదుల, కంతనపల్లి, డిండి, ఎస్ఎల్బీసీ, సీతారామ, నక్కల గండి ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్రానికి గుదిబండలా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు కోసం లక్షా 20వేల కోట్లు ఖర్చు చేస్తే అది మూడేళ్లకే మునిగిపోయిందని షర్మిల విమర్శించారు. ఆ ప్రాజెక్టు వ్యయంలో ఒక వంతు ఖర్చు చేసినా 33 ప్రాజెక్టులు పూర్తయ్యేవని అన్నారు.
రుణమాఫీ కోసం 36 లక్షల మంది రైతులు ఎదురు చూస్తుంటే బడ్జెట్లో కేవలం రూ.6 వేల కోట్లు మాత్రమే కేటాయించడాన్ని షర్మిల తప్పుబట్టారు. రైతు బంధు పేరుతో రూ.10 వేలు ఇచ్చి రైతులకిచ్చే సబ్సిడీలన్నీ బందు పెట్టారని మండిపడ్డారు. రైతులను రాజును చేశామంటున్న కేసీఆర్ రాష్ట్రంలో అన్నదాతలు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రూ.4.80లక్షల కోట్ల రుణాలతో రాష్ట్రాన్ని్ అప్పులకుప్పగా మార్చిన సీఎం కేసీఆర్.. ఒక్కొక్కరి నెత్తిన 1.20లక్షల అప్పు పెట్టిండని మండిపడ్డారు.