మందమర్రి, వెలుగు: ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టడం ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సీఎం కేసీఆర్ అన్యాయం చేశారని వైఎస్ఆర్టీపీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల అన్నారు. తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టును కట్టి ఉంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందేదన్నారు. శనివారం మంచిర్యాల జిల్లాలో ప్రజా ప్రస్థానం పాదయాత్ర సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. దివంగత సీఎం వైఎస్సార్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీటిలో ప్రాధాన్యం ఇచ్చారని చెప్పారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా 2 లక్షల ఎకరాలకు, గూడెం లిఫ్ట్ ద్వారా 50 వేల ఎకరాలకు సాగునీరు అందించారని, జిల్లాలో 30 వేల ఎకరాలకు పట్టాలు ఇచ్చారని తెలిపారు.
సీఎం కేసీఆర్ మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఒక్క ఎకరాకు కూడా నీళ్లు అందించలేదని షర్మిల మండిపడ్డారు. వార్దా ప్రాజెక్టు పూర్తి చేసినా లక్ష ఎకరాలకు నీరు అందేదన్నారు. వైఎస్ హయాంలో సింగరేణి కార్మికులకు ఇండ్ల పట్టాలు ఇచ్చారన్నారు. సింగరేణిలో అండర్ గ్రౌండ్ మైన్లు పెడతామన్న కేసీఆర్ ఆ సంగతి మరిచారని, కార్మికుల ఇండ్ల నిర్మాణానికి రూ. 10 లక్షల వడ్డీ లేని లోన్ లూ ఇవ్వడం లేదన్నారు. పోడు పట్టాలు అడిగితే మహిళలను సైతం జైలులో పెట్టిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. కాగా, శనివారం నాటికి షర్మిల పాదయాత్ర 200వ రోజు పూర్తయింది. ధర్మారం నైట్ క్యాంప్ నుంచి మొదలైన యాత్ర హాజీపూర్ మండలం గుడిపేట, ముల్కల్ల, వేంపల్లి, - మంచిర్యాల ఓల్డ్ టౌన్, బెల్లంపల్లి చౌరస్తా, ఏసీసీ, గద్దెరాగడి, తిమ్మాపూర్, ఆర్కేపీ క్రాస్‌రోడ్, బొక్కల గుట్ట వరకు సాగింది.