
వైసీపీ కీలక నేత మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పడం ఏపీ పాలిటిక్స్ లో ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. శుక్రవారం ( జనవరి 24, 2025 ) రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ ఎక్స్ వేదికగా ప్రకటించిన ఆయన ఇవాళ ( జనవరి 25, 2025 ) రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇదిలా ఉండగా ఏపీ పీసీసీ షర్మిల విజయసాయి రాజీనామాపై తనదైన శైలిలో స్పందించారు. విజయసాయి రెడ్డి జగన్ కు అత్యంత సన్నిహితుడని.. జగన్ ఏ పని ఆదేశిస్తే...ఆ పని చేయడం..ఎవరిని తిట్టమంటే వాళ్ళను తిట్టడం సాయి రెడ్డి పని అని అన్నారు. జగన్ విశ్వసనీయత కోల్పోయాడు కాబట్టే విజయసాయిరెడ్డి వెళ్ళిపోయాడని అన్నారు షర్మిల.
రాజకీయంగా కాదు..వ్యక్తిగతంగా కూడా..తన బిడ్డల విషయంలో అబద్ధాలు చెప్పిన వ్యక్తి సాయి రెడ్డి అని.. ఈ అబద్ధాలు జగన్ చెప్తే సాయి రెడ్డి చెప్పాడని అన్నారు. ఇలాంటి జగన్ సన్నిహితుడు రాజీనామా చేశాడు అంటే చిన్న విషయం కాదని.. వైసిపి కార్యకర్తలు, వైఎస్ అభిమానులు ఆలోచన చేయండని అన్నారు. జగన్ ను విజయసాయి రెడ్డి ఎందుకు వదిలేశారు. సన్నిహితులు ఒక్కొక్కరుగా ఎందుకు వెళ్తున్నారంటూ ప్రశ్నించారు.
Also Read : విజయసాయిరెడ్డి కేసుల నుంచి తప్పించుకోలేరు
జగన్ నాయకుడుగా విశ్వసనీయత కోల్పోయారని.. నాయకుడుగా ప్రజలను, నమ్ముకున్న వాళ్ళను మోసం చేశారని మండిపడ్డారు. జగన్.. నా అనుకున్న వాళ్ళను కాపాడుకోలేక పోతున్నాడని అన్నారు. జగన్ బీజేపీ కి దత్త పుత్రుడని.. తనను తాను కాపాడుకోవడానికి సాయి రెడ్డిని బీజేపీ కి పంపాడని అన్నారు. ఇన్నాళ్లు సాయి రెడ్డిని పక్కన పెట్టుకొని బీజేపీకి అనుకూలంగా ఉన్నాడని అన్నారు.
సాయి రెడ్డి బయటకు వచ్చాడు కాబట్టి ఇప్పుడైనా నిజాలు చెప్పాలని అన్నారు షర్మిల. వివేకా హత్య విషయంలో నిజం చెప్పినందుకు సంతోషమని.. మిగతా విషయాలు కూడా బయట పెట్టండని అన్నారు షర్మిల.