మరో కొత్త నాటకానికి కేసీఆర్ తెర తీసిండు : షర్మిల

కరీంనగర్ : సీఎం కేసీఆర్ మరో కొత్త నాటకానికి తెర తీశారని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. ‘‘ ఎమ్మెల్సీ కవితను పార్టీ మారాలని బీజేపీ కోరిందని కేసీఆర్ చెబుతుండటం విడ్డూరంగా ఉంది’’ అని ఆమె వ్యాఖ్యానించారు. బీజేపీలోకి వెళ్లనందుకే కవితను  లిక్కర్ స్కాంలో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ కేసీఆర్ కొత్త కథ అల్లుతున్నారని చెప్పారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా మానకొండూరు టౌన్ లో జరిగిన వైఎస్సార్టీపీ బహిరంగ సభలో షర్మిల మాట్లాడారు. ‘కవితకు బీజేపీ ఆహ్వానం అందడం అనేది నిజం కాదు. ఆమెకు ఏం తక్కువ అని బీజేపీలోకి మారాలి. అబద్ధం చెబితే అతికినట్టు ఉండాలి’ అని కామెంట్ చేశారు.

కేసీఆర్ అవినీతి పాలనను బీజేపీ కానీ,కాంగ్రెస్ కానీ ప్రశ్నించడం లేదన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ కు ఏమైనా చేశారా అని షర్మిల ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని చెబుతున్నారే తప్ప.. దానిపై విచారణ జరపాలని రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రాన్ని కోరడం లేదని షర్మిల చెప్పారు. ‘‘ కాళేశ్వరం పని చేయక పోయినా... SRSP వరద కాలువ పని చేస్తోంది. వైఎస్సార్ బతికి ఉంటే ఇక్కడ గ్యాస్ ఆధారిత పవర్ ప్లాంట్ వచ్చేది. 2400 మెగావాట్ల ప్లాంట్ కోసం 460 ఎకరాల భూ సేకరణ కూడా చేశారు. వైఎస్సార్  మరణం తర్వాత ఈ ప్రాజెక్ట్ ను పట్టించుకున్న వాళ్ళు లేరు’’ అని తెలిపారు. ఆనాడు పేదల కోసం వైఎస్సార్ రాజీవ్ స్వగృహ ప్రాజెక్ట్ కింద 80 ఎకరాల భూమి ఇస్తే..ఇప్పుడు ప్లాట్లు చేసి  అమ్ముకుంటున్నారని ఆరోపించారు.