30వ తేదీలోపు పార్టీ విలీనంపై నిర్ణయం : షర్మిల

కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీ విలీనంపై ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీ విలీనంపై సెప్టెంబరు 30 లోపు నిర్ణయం తీసుకుంటామన్నారు. ఒక వేళ విలీనం చేయకపోతే తెలంగాణ ఎన్నికల్లో  సొంతంగానే బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. 

కాంగ్రెస్‌లో వైఎస్ఆర్టీపీ విలీనం కాకుంటే..తెలంగాణ ఎన్నికల్లో 119 స్థానాల్లోనూ పోటీ చేస్తామని వైఎస్ షర్మిల తెలిపారు. అక్టోబరు రెండోవారం నుంచి ప్రజల మధ్య ఉండేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. పార్టీ కార్యవర్గం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.., పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యత ఉంటుందని షర్మిల హామీ ఇచ్చారు.

హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైఎస్ఆర్టీపీ కార్యాలయంలో షర్మిల అధ్యక్షతన పార్టీ రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. మొత్తం 33 జిల్లాల నుంచి పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు ఈ మీటింగ్ కు హాజరయ్యారు. పార్టీ విలీనం, ఎన్నికల వ్యూహంపై ప్రధానంగా చర్చించారు.