- సీఎం రేవంత్‌రెడ్డికి ఏపీపీసీసీ చీఫ్ షర్మిల డిమాండ్
- అవినీతిపై మాట్లాడడం వల్లేజగన్ నా ఆస్తి ఇవ్వట్లేదు
- ఆంధ్ర రాష్ట్రాన్ని అదానీ రాష్ట్రంగా మార్చేశాడని జగన్‌పై ఫైర్
- రేవంత్‌కు షర్మిల డిమాండ్
హైదరాబాద్, వెలుగు: అదానీ గ్రూప్‌తో ఇప్పటి వరకు చేసుకున్న అగ్రిమెంట్లను రద్దు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడారు.
ఇకపై ప్రభుత్వం ఎలాంటి ఒప్పందాలు చేసుకోకుండా అదానీని బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలన్నారు. ఏపీలో 2021లో అప్పటి ప్రభుత్వానికి రూ.1,750 కోట్ల లంచం ఇచ్చి అదానీ సోలార్ పవర్ అగ్రిమెంట్లు కుదుర్చుకున్నాడని అమెరికా బయటపెట్టిందన్నారు.
ఈ ముడుపులు మాజీ సీఎం జగన్ కే చేరాయని, ఆయన పేరు మాత్రమే బయటపెట్టకుండా సీఎం అనే అర్థం వచ్చేలా ఈ వివరాలను వెల్లడించిందని తెలిపారు. జగన్, అదానీల మధ్య చాలా ఒప్పందాలు కుదిరాయని, ఆంధ్ర రాష్ట్రాన్ని అదానీ రాష్ట్రంగా మార్చేశాడని మండిపడ్డారు. కాగా, ప్రభాస్‌తో తనకు ఎలాంటి సంబంధం అంటగడుతూ గతంలో ప్రచారం జరగడంపై షర్మిల స్పందించారు. అప్పట్లోనే తన బిడ్డలపై ప్రమాణం చేసి ప్రభాస్ ఎవరో తనకు తెల్వదని చెప్పానన్నారు.