జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర కొనసాగుతోంది. చిట్యాల మండలం దూతపల్లి వద్ద కల్లుగీత కార్మికులతో మాట్లాడిన షర్మిల.. వారి సమస్యలను తెలుసుకున్నారు. గౌడన్నల సమస్యలు వింటే కడుపు తరుక్కుపోతోందని ఆమె అన్నారు. చెట్టు మీద నుంచి పడి చనిపోతే ఇన్సురెన్స్ కూడా ఇవ్వరా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రెండు లక్షలు ఇస్తున్నామని చెబుతున్న సర్కార్ మాటలు పచ్చి అబద్ధం అన్నారు. ఊరూరా బెల్టు షాపులు తెచ్చి కల్లు గీత కార్మికుల బ్రతుకును చిద్రం చేశారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. బెల్డ్ షాపులు పెంచి.. కెమికల్ లిక్కర్ ను తాగిస్తున్నారని మండిపడ్డారు.
కల్లు గీత కార్మికుల సంక్షేమం టీఆర్ఎస్ సర్కారుకు పట్టదని వైఎస్ షర్మిల ఆరోపించారు. గౌడన్నకు కేసీఆర్ చేసింది శూన్యం అన్నారు. కల్లు గీత కార్మికులకు వైఎస్సార్ ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లే ఇప్పటికీ ఆధారం అయ్యాయని చెప్పారు. గౌడన్నల పిల్లలకు భరోసా లేదని షర్మిల విమర్శించారు. కులవృత్తి అని చెప్పి పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని అన్నారు. వారిని ఉన్నత చదువులకు ప్రోత్సహించ వద్దా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. వైఎస్ఆర్టీపీ అధికారంలోకి వస్తే.. గౌడన్న ల సంక్షేమానికి భరోసా ఉంటుందని చెప్పారు. ఇన్సూరెన్స్, ఎక్స్ గ్రేషియా, పిల్లల చదువులకు అండగా ఉంటామని షర్మిల హామీ ఇచ్చారు.