నిజామాబాద్, వెలుగు : బీఆర్ఎస్ పార్టీతో దేశాన్ని దోపిడీ చేసేందుకు సీఎం కేసీఆర్బయల్దేరారని వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో దోపిడీ చేసిన సొమ్ముతోనే బీఆర్ఎస్ పార్టీ పెట్టారని ఆమె ఆరోపించారు. కేసీఆర్ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఆమె చేపట్టిన పాదయాత్ర నిజామాబాద్ జిల్లాలో సోమవారం మూడో రోజు కొనసాగింది. మోస్రా, కొత్తపేట, మల్లారంలో కొనసాగిన పాదయాత్రలో షర్మిల మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ను దొంగ, మోసగాడు అని పిలవాలన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్నారు.
ఎనిమిదేళ్లుగా ప్రజలను కేసీఆర్ మోసగిస్తునే ఉన్నారని, బంగారు తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని షర్మిల విమర్శించారు. ‘‘తెలంగాణ సంపదను కొల్లగొట్టిన కేసీఆర్.. ఇప్పుడు దేశం మీద పడి దోచుకోవాలనుకుంటున్నడు. దేశాన్ని లూటీ చేసేందుకే జాతీయ పార్టీ పెట్టిండు. నీటి పారుదల ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల ప్రజాధనం తిన్నాడు. వేల కోట్ల కమీషన్లతో ఆస్తులు, విమానం కొన్నడు. ఆరోగ్యశ్రీ పథకాన్ని కోమాలో పెట్టిండు. ఉచిత కార్పొరేట్ వైద్యం కలగా మిగిలిపోతుంది” అని షర్మిల అన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని భ్రష్టుపట్టించి పేద మధ్యతరగతి ప్రజల ఊసురు పోసుకుంటున్నారని విమర్శించారు.