సిట్ అధికారులను ప్రగతి భవన్ గుప్పిట్లో పెట్టుకున్నారని ఆరోపించారు వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల. ఇందిరా పార్క్ దగ్గర టీ సేవ్ దీక్షలో పాల్గొన్న షర్మిల.. పేపర్ లీక్ కేసులో సిట్ అధికారులు మంత్రి కేటీఆర్ ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సైబర్ సెక్యూరిటీ ఆడిట్ జరిగి ఉంటే పేపర్ లీకేజీ జరిగేది కాదన్నారు. దమ్ముంటే ఈ లీకేజీ కేసుపై సీబీఐ దర్యాప్తు చేయించాలన్నారు. టీఎస్ పీఎస్ సీ కేసులో సిట్ విచారణ కొండను తవ్వి ఎలుకును పట్టినట్టుగా ఉందన్నారు. ఈ మేరకు షర్మిల కేసీఆర్ కు 10 ప్రశ్నలు ఉన్న క్వశ్చన్ పేపర్ ను పంపుతున్నట్లు చెప్పారు.
పేపర్ లీక్ కేసులో సిట్ విచారణ పారదర్శకంగా లేదని.. అసలు సూత్రధారులను వదిలేశారని ఆరోపించారు షర్మిల. ప్రభుత్వ శాఖల్లో సమాచారం అంత సులభంగా ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. పేపర్ లీక్ ఘటనతో తనకే సంబంధం లేదంటున్న కేటీఆర్ .. అసలు ఐటీశాఖ బాధ్యతలు ఏంటో తెలుసా ? అని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం వల్లే తాను రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందన్నారు షర్మిల. రాష్ట్రంలో సంక్షేమ పాలన కనిపించకుండా పోయింది కాబట్టే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. తనకు పోలీసులతో గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదని.. సెల్ఫ్ డిఫెన్స్ లో భాగంగానే తాను అలా చేశానన్నారు.