తెలంగాణ ఉద్యమ సమయంలో తనకు ఉద్యమం తప్ప ఏదీ వద్దన్న కేసీఆర్.. ఇప్పుడు కుటుంబం మొత్తానికి పదవులు ఇచ్చాడని వైఎస్ షర్మిల ఆరోపించారు. ఎనిమిదేళ్లుగా సీఎంగా ఉన్న కేసీఆర్ రాష్ట్ర ప్రజల కోసం ఏం చేశారో చెప్పాలని ఆమె ప్రశ్నించారు. ప్రజలకు ఏమీ చేయకపోగా.. నాలుగు లక్షల కోట్ల అప్పు తెచ్చారని విమర్శించారు. వైఎస్ ఉన్నప్పుడు ఇన్ పుట్ సబ్సిడీ ఉండేదని.. ఇప్పుడు కేసీఆర్ పాలనలో అవేమీ లేవన్నారు. రుణమాఫీ చేస్తామని చెప్పి ఎందుకు చేయలేదన్నారు. జగిత్యాల నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా ప్రస్థానం పాదయాత్రలో షర్మిల ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు తిప్పన్నపేట, పొలాస, అనంతారం, తక్కెళ్లపల్లి గ్రామాల్లో షర్మిలకు ఘన స్వాగతం లభించింది.
ప్రజా ప్రస్థానం పాదయాత్రలో వైఎస్ షర్మిల టీఆర్ఎస్ ప్రభుత్వం పై పలు ప్రశ్నలు సంధించారు. ‘‘ మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు.. కేజీ టూ పీజీ ఉచిత విద్య.. ఇంటికో ఉద్యోగం.. నిరుద్యోగ భృతి.. డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామన్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్ నెరవేర్చలేదు’’ అని షర్మిల పేర్కొన్నారు. అన్నీ మోసపూరిత హామీలే ఇచ్చారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రూ.70వేల కోట్లు దోచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకప్పుడు స్కూటర్ లో తిరిగే కేసీఆర్.. తెలంగాణ ఖజానాను కొట్టగొట్టి విమానాలు, హెలికాప్టర్లు కొంటున్నాడని అన్నారు. తెలంగాణలో మళ్లీ రాజశేఖర్ రెడ్డి పాలన తీసుకురావడానికే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టామని షర్మిల చెప్పుకొచ్చారు.