హైదరాబాద్, వెలుగు: బెయిల్రద్దైతదని వైఎస్ జగన్.. తల్లిని కోర్టు లాగాడని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ అభిమానులు, తాను చేసిన పాదయాత్ర వల్లే 151 సీట్లు సాధించి 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిందన్నారు. శనివారం విజయవాడలో వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. జగన్ కొంతమందితో తనపై అడ్డమైన కామెంట్లు చేయిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తి వివాదాలపై మళ్లీమళ్లీ మాట్లాడటం ఇష్టం లేదని ఆమె అన్నారు. తన ప్రశ్నలకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు.
జగన్ అంటే ఎంతో ప్రాణం కనుకే.. ఆయన కోసం పాదయాత్ర చేశానన్నారు. రెండు ఎన్నికల్లో జగన్ కోసం ప్రచారం చేశానని చెప్పారు. జగన్ కోసం తాను ఎన్నో చేశానని.. జగన్ తన కోసం ఏం చేశారో చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. “నాకు, నా బిడ్డలకు జగన్ అన్యాయం చేస్తున్నారనేది పచ్చి నిజం. ఇవన్నీ దేవుడికి, అమ్మకు, నాన్నకు, చాలా మందికి తెలుసు. ఐదేండ్లు ఎంఓయూ నా చేతిలో ఉంది. ఇందులో ఈ ఆస్తులు నావి అని వారు సంతకాలు పెట్టారు. ఐదు సంవత్సరాలలో దాన్ని నేను ఎక్కడ బయటపెట్టలే.. ఇప్పుడు ఈ ఎంఓయూ అనేక మంది చేతుల్లో ఉందంటే కారణం ఎవరు? వైఎస్ఆర్ సతీమణిని కోర్టుకు పిలిచారంటే కారణం ఎవరు? అలాంటి కొడుకును ఎందుకు కన్నాను అని ఆ తల్లి మదన పడుతుంది. జగన్ బెయిల్ రద్దు అవుతుందనే కారణంతోనే మమ్మల్ని కోర్టుకు లాగారు” అంటూ షర్మిల తీవ్రమైన కామెంట్స్ చేశారు. జగన్‌కు లాభం జరుగుతుందని తల్లిని సైతం కోర్టుకు లాగుతారా అని ఆమె ప్రశ్నించారు.