- కేసీఆర్ సర్కారుపై షర్మిల ఫైర్
- నాగర్ కర్నూల్ జిల్లా అంబటిపల్లిలో నిరుద్యోగ దీక్ష
లింగాల, వెలుగు: రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ కేసీఆర్ సర్కారు హత్యలేనని వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల ఆరోపించారు. రాష్ట్రంలో దరిద్రపు పాలన కొనసాగుతోందని ఫైర్ అయ్యారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం అంబటిపల్లికి చేరుకోగా స్థానిక మహిళలు షర్మిలకు బోనాలతో స్వాగతం పలికారు. అంబటిపల్లిలో షర్మిల 3 గంటలపాటు నిరుద్యోగ దీక్ష చేపట్టారు. ఆమె మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు స్విచ్ వేయడం ఎన్నికల తర్వాత స్విచ్ ఆఫ్ చేయడం కేసీఆర్కు మాత్రమే సాధ్యమన్నారు. ఎన్నికలొస్తేనే ఉద్యోగాలిస్తారా అని ప్రశ్నించారు. తెలంగాణలో ఏ ఎన్నిక వచ్చినా 50 వేల ఉద్యోగాలిస్తామని అంటున్నారు తప్ప.. నోటిఫికేషన్లు ఇవ్వట్లేదన్నారు. రాష్ట్రంలో 40 లక్షల మంది నిరుద్యోగులున్నారని గుర్తుచేశారు. సొంత రాష్ట్రంలోనూ యువకులు ఉద్యోగాలు లేక చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఏపీలో వైఎస్ హాయంలో ఐదేండ్లలో 3 సార్లు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చారని ఆమె గుర్తుచేశారు.
ఇంటికో ఉద్యోగం ఏమాయె?
ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న సీఎం కేసీఆర్ హామీ ఏమైందని షర్మిల ప్రశ్నించారు. డిగ్రీలు, పీజీలు చదివిన యవకులు కూలీ పని చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే ఉద్యోగ కల్పనపైనే తొలి సంతకం చేస్తామన్నారు. వైఎస్ హయాంలో పాలమూరు జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణం, సాగు, తాగునీరు అందించేందుకు కృషి చేశారని గుర్తుచేశారు. కేసీఆర్ బంగారు తెలంగాణా అని చెప్పి అప్పుల తెలంగాణగా రాష్ట్రాన్ని మార్చారని మండిపడ్డారు. అచ్చంపేట వైఎస్సార్టీపీ ఇన్చార్జ్ సిరి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.