ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

పార్టీ ఆఫీసుకు భూమిపూజ 

ఖమ్మం, వెలుగు: వైఎస్సార్​ టీపీ అధ్యక్షురాలు షర్మిల ఇవాళ ఖమ్మం రానున్నారు. పాలేరు నియోజకవర్గం పరిధిలోని కరుణగిరిలో పార్టీ ఆఫీస్​ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి 11 గంటల వరకు ఖమ్మం చేరుకుంటారని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిట్టా రాంరెడ్డి తెలిపారు. గురువారం పార్టీ ఆఫీస్​ నిర్మించనున్న స్థలంలో ఏర్పాట్లను పార్టీ నాయకులతో కలిసి  పరిశీలించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై షర్మిల చేస్తున్న ఆందోళనలు, పార్టీ కార్యక్రమాలకు వస్తున్న స్పందన చూసి తట్టుకోలేక టీఆర్ఎస్​ నేతలు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. బస్సును తగులబెట్టడం, నాయకులను అరెస్ట్ చేయడంపై ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేస్తున్నా బుద్ధిరావడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్సార్​టీపీ అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పాలేరు నుంచి షర్మిల జైత్రయాత్ర మొదలుపెట్టనున్నారని చెప్పారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్, తుంపాల కృష్ణమోహన్​ 
పాల్గొన్నారు. 

గోవిందరాజస్వామికి అభిషేకం

భద్రాచలం, వెలుగు: శ్రీసీతారామచంద్రస్వామి అనుబంధంగా ఉన్న గోవిందరాజస్వామి ఆలయంలో గురువారం అభిషేకం నిర్వహించారు. తాతా గుడి సెంటర్​లోని గోవిందరాజస్వామికి పంచామృతాలతో అభిషేకం, సమస్త నదీజలాలతో స్నపన తిరుమంజనం చేసి ప్రత్యేక హారతులిచ్చారు. అంతకుముందు ఉదయం గోదావరి నుంచి తీర్థబిందెను తెచ్చి రామాలయంలో మూలవరులకు సుప్రభాత సేవ చేసి బాలబోగం నివేదించారు. ఆ తర్వాత అర్చకులు గోవిందరాజస్వామికి అభిషేకం నిర్వహించారు. సీతారాముల కల్యాణమూర్తులను ప్రాకార మండపానికి తీసుకెళ్లి నిత్య కల్యాణం జరిపించారు. మాధ్యాహ్నిక ఆరాధనల తర్వాత రాజబోగం నివేదించారు. సాయంత్రం దర్బారు సేవ జరిగింది. 

23 నుంచి నిత్య కల్యాణాలు రద్దు

వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈనెల 23 నుంచి జనవరి 2 వరకు శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిత్య కల్యాణాలు రద్దు చేస్తున్నట్లు ఈవో శివాజీ ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులు సహకరించాలని ఆయన కోరారు.

ముక్కోటి ఏర్పాట్లు పరిశీలించిన  ఆర్డీవో

భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లను ఆర్డీవో రత్న కల్యాణి గురువారం పరిశీలించారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున అవసరమైన సౌలతులు కల్పించనున్నట్లు తెలిపారు. వాహనాల పార్కింగ్ కోసం టౌన్​లో ఐదు స్థలాలను చూశారు. బ్రిడ్జి పాయింట్, మిథిలాస్టేడియం వెనుక, మార్కెట్​యార్డు, కూనవరం రోడ్డు, కొత్త మార్కెట్లలో వాహనాల పార్కింగ్​ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ట్రాఫిక్​ను దృష్టిలో ఉంచుకొని వాహనాల రాకపోకలను క్రమబద్దీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎక్కడా రాజీపడొద్దని తహసీల్దార్​ శ్రీనివాస్​యాదవ్​ను ఆదేశించారు.

ఆవిర్భావ వేడుకల పనులు కంప్లీట్​ చేయాలి

ఇల్లందు, వెలుగు: సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు పట్టణంలోని సింగరేణి స్కూల్ గ్రౌండ్ లో ఏర్పాట్లు పూర్తి చేయాలని  జీఎం షాలేం రాజు అధికారులను ఆదేశించారు. గురువారం జీఎం ఆఫీసులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి స్టాల్స్  ఏర్పాటు చేయాలని, అత్యుత్తమ ప్రతిభ చూపిన అధికారులు, కార్మికులకు సన్మానం, సాంస్కృతిక కార్యక్రమాలు, మహిళలకు, పిల్లలకు ఆటల పోటీలకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎస్వోటు జీఎం మల్లారపు మల్లయ్య, అధికారుల సంఘం అధ్యక్షుడు పంజాల శ్రీనివాసు, ఏజీఎంలు జి ప్రభాకర్ రావు, ఎం గిరిధరరావు, డీజీఎంలు జీవీ మోహన్ రావు, రామచంద్ర,  ఎస్ఈ డా.ఆదినారాయణ, ఏరియా సర్వే ఆఫీసర్​ బాలాజీ నాయుడు, జేకే ఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్​ బొల్లం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ఘనంగా ఇంధన పరిరక్షణ దినోత్సవం

ఇంధన పరిరక్షణ దినోత్సవాన్ని జీఎం ఆఫీసులో నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ దేశంలో 70 శాతం విద్యుత్  ఉత్పత్తి థర్మల్  పవర్ స్టేషన్ల ద్వారా జరుగుతుందని తెలిపారు. ఇండ్లలో విద్యుత్​ వృథా కాకుండా చూసుకోవాలని సూచించారు. ఉద్యోగులు, కార్మికులకు ఇంధన వినియోగంపై పలు సూచనలు చేశారు. 

ఆశా వర్కర్ల ఆందోళన బాట

భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం టౌన్, వెలుగు: ఉద్యోగ భద్రత కల్పించాలని ఆశ వర్కర్ల సంఘం, లెఫ్ట్​ పార్టీల జిల్లా నాయకులు డిమాండ్​ చేశారు. కొత్తగూడెంలోని ధర్నా చౌక్​లో ఆశా వర్కర్లు గురువారం 48 గంటల దీక్షను చేపట్టారు. ఖమ్మం సిటీలోని ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించిన అనంతరం ర్యాలీ చేపట్టి డీఎంహెచ్​వో ఆఫీస్​ ముందు ఆందోళనకు దిగారు. డీఎంహెచ్​వో డాక్టర్​ మాలతికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ నెలకు రూ. 26 వేల జీతం ఇవ్వాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. రోగులకు సేవలందించడంతో పాటు ప్రభుత్వాలకు అవసరమైన రిపోర్టులను అందించేందుకు సహకరిస్తున్న ఆశా వర్కర్ల పట్ల పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కొత్తగూడెంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజే రమేశ్, వివిధ పార్టీల జిల్లా కార్యదర్శులు ఎస్కే షాబీర్​పాషా, అన్నవరపు  కనకయ్య, కెచ్చల రంగారెడ్డి పాల్గొన్నారు. 

తొలిమెట్టుతో విద్యాప్రమాణాలు పెరగాలి

వైరా, వెలుగు: తొలిమెట్టు ద్వారా విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్  వీపీ గౌతమ్  సూచించారు. గురువారం కొణిజర్ల మండలం లల్లోరిగూడెం ప్రైమరీ స్కూల్, తీగలబంజర యూపీఎస్​లో తొలిమెట్టు అమలు తీరును పరిశీలించారు. చైతన్య సారథి ట్రస్ట్ ద్వారా కొణిజర్ల మండలం పెద్దగోపతి జడ్పీ హైస్కూల్​లో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభించారు. హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్ లో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని తాను దాచుకున్న డబ్బుతో గవర్నమెంట్​ స్కూల్​లో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేసి, ల్యాబ్ టీచర్ తో నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యార్థులతో కలిసి కలెక్టర్​ మధ్యాహ్న భోజనం చేశారు. గోద్రెజ్  వారిచే గుబ్బగుర్తిలో ఏర్పాటు చేసిన సమాధాన్  వన్  స్టాప్  సొల్యూషన్ ను ప్రారంభించారు. రైతులకు అందించే సేవలను అడిగి తెలుసుకున్నారు. ఎంఈవో శ్యాంసన్, తహసీల్దార్ సైదులు, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ డీఈ వైకుంఠాచారి పాల్గొన్నారు.

గ్రీనరీ పనులు త్వరగా పూర్తి చేయాలి

ఖమ్మం టౌన్: ఇంటిగ్రేటెడ్​ ఆఫీస్  కాంప్లెక్స్​లో గ్రీనరీ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్  వీపీ గౌతమ్  ఆదేశించారు. గురువారం కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభితో కలిసి గ్రీనరీ పనులను పరిశీలించారు. అగ్రిమెంట్​లో సూచించిన ప్రకారం గ్రీనరీ పనులు, మొక్కలు నాటాలని సూచించారు. బిల్డింగ్​ పనులను పరిశీలించారు. లిఫ్ట్​ల ఏర్పాటు పూర్తయినట్లు తెలిపారు. మిగిలి ఉన్న పనులు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్  ఆదేశించారు. హార్టికల్చర్​ ఆఫీసర్​ అనసూయ, ఆర్అండ్ బీ ఈఈ శ్యాంప్రసాద్, ఏఈ విశ్వనాథ్  పాల్గొన్నారు.

యూత్ ఫెస్టివల్ కు కేఎండీసీ స్టూడెంట్స్

ఖమ్మం టౌన్, వెలుగు: సిటీలోని కవిత మెమోరియల్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్  కేయూలో జరిగిన ఎన్ఎస్ఎస్  యూత్ ఫెస్టివల్  డిబేట్ కాంపిటీషన్ లో ఈశ్వర రాకేశ్, లోహిత్  ఫస్ట్ ప్లేస్ లో నిలిచి స్టేట్ లెవెల్ పోటీకి అర్హత సాధించినట్లు కాలేజీ సెక్రటరీ, కరస్పాండెంట్ కోట అప్పిరెడ్డి, చైర్మన్ ఎం నిరంజన్ రెడ్డి తెలిపారు. వరంగల్ కాళోజీ యూనివర్సిటీలో జరిగే పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. ప్రిన్సిపాల్  డాక్టర్  కేవీ రమణారావు తదితరులు వారిని అభినందించారు. 

అంబులెన్స్ లను రోడ్లపై పార్కింగ్​ చేయొద్దు

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: అంబులెన్స్ లను సిటీలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై పార్కింగ్ చేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని ట్రాఫిక్  సీఐ అంజలి తెలిపారు. ట్రాఫిక్ పీఎస్ లో గురువారం అంబులెన్స్ ఓనర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రమాదాలకు గురికాకుండా డ్రైవర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మద్యం అలవాటు ఉన్న వారిని అంబులెన్స్  డ్రైవర్లుగా పెట్టుకోవద్దని ఓనర్లకు సూచించారు. ఎమర్జెన్సీ పేషెంట్లు లేకపోయినా డ్రైవర్లు సైరన్‌‌‌‌ ఉపయోగిస్తున్నారని తెలిపారు.