ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు. తొమ్మిది ప్రశ్నలతో షర్మిల రాసిన బహిరంగ లేఖ సంచలనంగా మారింది. లేఖలో "నవరత్నాలు సరే, మాకు ఉన్న నవసందేహాలకు సమాధానం చెప్పు అన్నయ్యా" అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు షర్మిల. వైఎస్ హయాంలో ఎస్సీ, ఎస్టీలకు భూములు ఇచ్చారు, వాటిని ఎందుకు ఆపేశారు, గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన 28పథకాలను ఎందుకు ఆపేశారని ప్రశ్నించారు షర్మిల. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కోసం ప్రవేశ పెట్టిన విదేశీ విద్య పథకానికి అంబేద్కర్ పేరును ఎందుకు తీసేశారని అన్నారు.
ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్ళించడం నిజం కాదా, వైసీపీలో ఎస్సీ, ఎస్టీ స్థానాలను సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎందుకు టికెట్లు ఇవ్వలేదని ప్రశ్నించారు. అంబేద్కర్ స్టడీ సర్కిల్ లకు డబ్బులు ఎందుకు ఇవ్వడం ఆపేశారని అన్నారు. ఈ ఐదేళ్ళలో రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరిగాయని, ఇది వివక్ష కాదా అని అన్నారు. దళితుడ్ని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని ఎందుకు వెనకేసుకు వస్తున్నారని ప్రశ్నించారు షర్మిల.