కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
డిచ్‌పల్లి, వెలుగు: డిచ్‌పల్లి 7వ పోలీస్ బెటాలియన్‌లోని లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు రెండో రోజూ కొనసాగాయి. కమాండెంట్ సత్య శ్రీనివాస్, పర్వత వర్ధిని దంపతుల ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం ఆరాధన, గరుడ ప్రతిష్ఠ, సోమ కుంభస్థాపన, అగ్ని ప్రతిష్ఠ, అంకురార్పణ, హోమం, ధ్వజారోహణ కార్యక్రమాలు జరిగాయి. మధ్యాహ్నం అన్నదానం నిర్వహించారు. అసిస్టెంట్ కమాండెంట్స్ వెంకటేశ్వర్లు, ఆంజనేయరెడ్డి, భాస్కర్‌రావు, ఆర్ఐలు వెకటేశ్వర్లు, అనిల్‌కుమార్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి షర్మిల పాదయాత్ర
కామారెడ్డి, వెలుగు: వైఎస్సాఆర్‌టీపీ స్టేట్ ప్రెసిడెంట్ వై.ఎస్ షర్మిల శనివారం నుంచి కామారెడ్డి జిల్లాలో ఐదు రోజుల పాటు పాదయాత్ర చేపట్టనున్నట్లు ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి నీలం రమేశ్, స్టేట్ అధికార ప్రతినిధి సత్యవతి తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో జరిగిన మీటింగ్‌లో వారు మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్డు నుంచి పాదయాత్ర షూరు అవుతుందన్నారు. ఇందిరా చౌక్‌వద్ద జరిగే మీటింగ్‌లో షర్మిల మాట్లాడుతారన్నారు. ఇక్కడి నుంచి ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల మీదుగా యాత్ర సాగుతుందన్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ మొద్దు నిద్రలో ఉందని, ప్రజల సమస్యలను లేవనెత్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు షర్మిల యాత్ర కొనసాగిస్తున్నారని చెప్పారు. యాత్రకు రాజన్న అభిమానులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. టౌన్ ప్రెసిడెంట్ తాహేర్ పాల్గొన్నారు.
జంబి హనుమాన్ మందిర సమస్యలు పరిష్కరించాలి
ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ టౌన్‌లోని జంబి హనుమాన్ మందిర సమస్యలు పరిష్కరించాలని 29వ వార్డు కౌన్సిలర్ సాయి కుమార్ డిమాండ్ చేశారు. ఆలయ ఆవరణలో దసరా రోజు జరిగిన వేడుకల్లో తనను విస్మరించారని, సమస్యలు చెప్పే అవకాశం ఇవ్వలేదన్నారు. మందిర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఇన్‌చార్జి శ్రీకాంత్‌కు ఆయన మెమోరాండం అందజేశారు. దసరా ఉత్సవాలను ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి రాజకీయ వేదికగా మార్చుకున్నారని ఆరోపించారు. తాను బీజేపీ కౌన్సిలర్ కావడంతోనే వేదికపై ఆహ్వానించకుండా అవమానపరిచారన్నారు. ఆధ్యాత్మిక ప్రాంగణాన్ని రాజకీయ వేదికగా మార్చడం సరైంది కాదని, ఆలయంలో నెలకొన్న సమస్యలను పరిశీలించి పరిష్కరించాలన్నారు.
మునుగోడులో ఎగిరేది గులాబీ జెండానే
మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
బాల్కొండ, వెలుగు: ఎవరెన్ని కుట్రలు చేసినా మునుగోడులో ఎగిరేది గులాబీ జెండానే అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనే బాల్కొండ నియోజకవర్గ లీడర్లతో హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో శుక్రవారం మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి మునుగోడులో విజయం సాధిస్తామన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ లీడర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నెలాఖరులోగా సర్వే పూర్తి చేయాలి
కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్
లింగంపేట, వెలుగు: పోడు భూముల జాయింట్ సర్వేను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ జితేష్ విపాటిల్ ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం లింగంపేటలోని ఐకేపీ భవనంలో ఎల్లారెడ్డి, లింగంపేట మండలాలకు చెందిన ఫారెస్టు, రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖల ఆఫీసర్లతో ఆయన సమావేశమయ్యారు. పోడు భూముల పట్టాలు పొందడానికి దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారుల వివరాల ఆధారంగా ఫారెస్టు బీట్ ఆఫీసర్లు, పంచాయతీ సెక్రటరీలు, సర్వే నిర్వహించాలని సూచించారు. పోడు భూముల పేరిట చెట్లను నరికే వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. రైతులు సాగు చేస్తున్న భూములు అటవీ శాఖకు చెందినవా..? రెవెన్యూ శాఖకు చెందినవా..? అనేది ముందుగా తేల్చి, ఎన్ని ఏళ్లుగా సాగులో ఉన్నారు అనే అంశాలను వెబ్సైట్లో నమోదు చేయాలని సూచించారు. లింగంపేట మండలంలోని మాలోత్ సంగ్యానాయక్తండా, ఎక్కపల్లి, మెంగారం, కంచ్‌మల్, కొండాపూర్, ముంబాజీపేట, బంజారాతండాలో ఎక్కువ మంది దరఖాస్తులు చేసుకున్నారని కలెక్టర్ చెప్పారు.
అర్హులైన వారికే పట్టాలివ్వాలి
పోడు భూముల పట్టాలు పొందడానికి దరఖాస్తులు చేసుకున్న వారిలో అర్హులైన వారికే ఇవ్వాలని కలెక్టర్ పాటిల్ సూచించారు. గ్రామాల్లో పోడు భూముల పరిరక్షణ కమిటీ సభ్యులు తీర్మానించిన వారికి భూములు కేటాయించాలని ఒత్తిడి తెస్తున్నారని ఓ బీట్ ఆఫీసర్ కలెక్టర్ దృష్టికి తేగా అర్హులకు మాత్రమే ఇవ్వాలని సూచించారు. పట్టాల కోసం ఎవరైనా ఆఫీసర్లను ఇబ్బందిపెడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఎల్లారెడ్డి ఫారెస్టు రేంజ్‌ఆఫీసర్ ఓంకార్, లింగంపేట ఎంపీడీవో నారాయణ, తహసీల్దార్ మారుతి, ఆర్ఐ బాలయ్య, ఫారెస్టు సిబ్బంది, పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్‌కు గుణపాఠం తప్పదు
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌గౌడ్
జోడో యాత్రతో దేశంలో కాంగ్రెస్ హవా
నిజామాబాద్, వెలుగు: ఎన్నికల హామీలను విస్మరించిన టీఆర్‌ఎస్ రాబోయే రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు రెడీగా ఉన్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేశ్‌గౌడ్ పిలుపునిచ్చారు. జిల్లా కాంగ్రెస్ భవన్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ అనేది బీజేపీకి బీ టీమ్‌గా మారిందన్నారు.ఆ పార్టీతో ఉన్న ఒప్పందాల కోసమే కేసీఆర్ బీఆర్ఎస్‌ను ఏర్పాటు చేస్తున్నాడని ఆరోపించారు. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేసీఆర్ ఇచ్చిన బూటకపు హామీలను నమ్మి ప్రజలు గెలిపించారన్నారు. 8 ఏళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా అప్పుల పాలు చేశాడని ఆరోపించారు. మానిఫెస్టోలో ఇచ్చిన హామీలు దళితుడిని సీఎం చేయడం, దళితులకు మూడు ఎకరాల భూమి , డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, నిరుద్యోగ భృతి, ఇంటికొక ఉద్యోగం, 24 గంటల కరెంట్ ఏమీ ఇవ్వకుండా టిఆర్ఎస్ ప్రజలను మోసగించింద ని విమర్శించారు. ప్రాజెక్ట్‌ల పేరుతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కల్వకుంట్ల కుటుంబం, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధనిక కుటుంబాలుగా ఎదిగారని ఆరోపించారు. టీఆర్‌ఎస్ నిరంకుశ పాలనకు ప్రజలు చరమగీతం పాడే రోజు దగ్గరలోనే ఉందన్నారు. దేశంలో ఉన్న బీజేపీ కులం, మతం పేరుతో విభజిస్తుంటే.. కులమతాలకు అతీతంగా దేశాన్ని ఒకటి చేయాలని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగిస్తున్నారని చెప్పారు. యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని తెలిపారు. సమావేశంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి జి.గంగాధర్, అర్బన్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ కేశ వేణు, పీసీసీ కార్యదర్శి రాంభూపాల్, సీనియర్ కాంగ్రెస్ నాయకులునరాల రత్నాకర్, బీసీ సెల్ మాజీ ప్రెసిడెంట్ బాడ్సి శేఖర్‌గౌడ్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ముప్ప గంగారెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్ నీరడి భాగ్య, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కార్యదర్శి గాజుల సుజాత, నగర మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ మఠం రేవతి పాల్గొన్నారు.
బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జీల నియమాకం
కామారెడ్డి, వెలుగు: క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త ఇన్‌చార్జీలను నియమించింది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కో లీడర్‌కు బాధ్యతలు అప్పగించింది. కామారెడ్డి నియోజకవర్గానికి బద్దం మహిపాల్‌రెడ్డి, ఎల్లారెడ్డికి గడీల శ్రీకాంత్‌గౌడ్, జుక్కల్‌కు రితేశ్ రాథోడ్, బాన్సువాడకు ఆకునూరి రమాకాంత్‌ను నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటన విడుదల చేశారు. కామారెడ్డి జిల్లాకు చెందిన నీలం చిన్న రాజులును ఆదిలాబాద్జిల్లా ఖానాపూర్ నియోజకవర్గానికి, బాణాల లక్ష్మారెడ్డికి నారాయణ్‌ఖేడ్ నియోజకవర్గం బాధ్యతలు అప్పగించారు.
ఎల్‌కే ఫారంలో కుక్కల స్వైరవిహారం
ఇరవై మేకలు, ముగ్గురు వ్యక్తులపై దాడి
నవీపేట్, వెలుగు: మండలంలోని రాంపూర్ జీపీ పరిధిలోని ఎల్‌కే ఫారంలో పిచ్చి కుక్కలు ముగ్గురు వ్యక్తులు, ఇరవై మేకలపై దాడి చేసి గాయపరిచాయి. వారం రోజులుగా గ్రామంలో రోడ్ల మీద వ్యక్తులను కుక్కలు వెంబడించడంతో జనాలు భయాందోళన చెందుతున్నారు. కొందరు ఇండ్లలో పెంచుకునే కుక్కలను కూడా ఇష్టారీతిగా వదిలేస్తున్నారని పలువురు ఆరోపించారు. జీపీ సిబ్బంది కుక్కల యజమానులకు నోటీసులు ఇచ్చినా పట్టించుకోవడం లేదని పేర్కొ
న్నారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలనికోరుతున్నారు.
మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం
కామారెడ్డి, వెలుగు: పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా సంబంధిత వ్యక్తిపై ఎలాంటి చర్య తీసుకోలేదని మనస్తాపంతో కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర్‌కు చెందిన బట్టు ఎల్లయ్య అనే వ్యక్తి శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. సంగమేశ్వర్ శివారులో బట్టు ఎల్లయ్యకు పొలం ఉంది. 4 రోజుల కింద ఆయన పొలాన్ని ఆదే గ్రామానికి నడిపి నర్సయ్యకు చెందిన గొర్లు వచ్చి మేశాయి. గొర్లకు అక్కడి నుంచి పంపించే విషయంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఎల్లయ్య గురువారం రాత్రి దోమకొండ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. మరోసారి శుక్రవారం ఉదయం స్టేషన్‌కు వెళ్లి ఎస్సైని కలిశారు. అయినా పోలీసులు స్పందించపోవడంతో మనస్తాపానికి గురైన ఎల్లయ్య ఊరి శివారులో పురుగుల మందు తాగాడు. గమనించిన స్థానికులు అతడిని కామారెడ్డి జిల్లా హాస్పిటల్‌కు తరలించారు.