తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మరోసారి విమర్శలు గుప్పించారు తెలంగాణ వైఎస్ఆర్సీపీ నాయకురాలు వైఎస్ షర్మిల. రాష్ట్రంలో అమ్మాయిలపై అత్యాచారాలు జరుగుతున్న సీఎం పట్టించుకోవడం లేదంటూ ఆమె ఆరోపించారు. సిరిసిల్ల నియోజకవర్గంలో గిరిజిన అమ్మాయిపై అత్యాచారం జరిగిందన్నారు. ఈ కేసులో నిందితుడు కేటీఆర్ సన్నిహితుడు అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయన్నారు. అయితే ఘటన జరిగి 5 రోజుల తర్వాత కేటీఆర్ వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారని విమర్శించారు షర్మిల. ఆ పరామర్శ కూడా వైసీపీ కార్యకర్తల ఆందోళనతోనే అంటూ ఆమె చురకలంటించారు. కేటీఆర్ పరామర్శలో సిన్సియారిటీ ఉందా? సింపథీలో ఎంపతీ ఉందా ? అంటూ ప్రశ్నించారు. ఈ ఘటన జరిగిన ఇన్నిరోజులా తర్వాత పరామర్శిస్తే బాధితులకు భరోసా లభిస్తుందా ? ఇందుకేనా ప్రజలు మీకు అధికారం ఇచ్చింది? అంటూ నిలదీశారు.
ఈ కేసును కప్పిపుచ్చడానికి చాల ప్రయత్నాలు చేసారన్నారు. కేసు పెట్టకుండా చూడాలని బాధితురాలి తల్లిదండ్రులపై చాల ఒత్తిడి తీసు కొచ్చారని ఆరోపించారు. సమాజంలో అట్టడుగున ఉన్న వర్గానికి చెందిన బిడ్డపై అత్యాచారం జరిగితే ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. అత్యాచారానికి పాల్పడింది టీఆరెస్ నాయకుడు అంటూ షర్మిల మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో మహిళలకు రక్షణ, విలువ, గౌరవం లేవన్నారు. మహిళలు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉండటం కేసీఆర్‌కు ఇష్టం ఉండదన్నారు. సీఎం దృష్టిలో మహిళలకు విలువేలేదని విమర్శించారు. చిన్నదొర కేటీఆర్ కు మహిళలు పోరాటాలు చేస్తే జీర్ణం చేసుకోలేరన్నారు. మహిళలు వ్రతాలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేస్తారని షర్మిల మండిపడ్డారు.
మంత్రులు వావి వరసలు లేకుండా ఎవర్ని పడితే వారిని మరదలు అని పిలుస్తారంటూ విమర్శించారు. ఆరేళ్ల చిన్నారిపై కూడా అత్యాచారాలు జరుగుతున్నాయని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. యధా లీడర్ తథా క్యాడర్ అంటూ... సీఎం కేసీఆర్ పాలనపై ధ్వజమెత్తారు.
కేటీఆర్ స్వంత నియోజకవర్గంలోనే మహిళలకు రక్షణ లేదని ఆరోపించారు. సీఎం కెసిఆర్ ఆడబిడ్డలను కన్నెత్తి చూస్తే గుడ్లు పీకేస్తానని చెప్పారన్నారు.. కానీ టీఆరెస్ పార్టీ నేతలే అత్యాచారాలు చేస్తున్నారని షర్మిల విమర్శించారు. మంత్రులే వావివరసలు మరిచి మహిళలను కించపరుస్తుంటే వారిపై ఏం చర్యలు తీసుకున్నారు? అని షర్మిల ప్రశ్నించారు. ఆరేళ్ళ చిన్నపిల్లలకు కూడా రక్షణ కల్పించలేని కెసిఆర్ ఉరేసుకోవాలని మండిపడ్డారు షర్మిల.
ఈ కేసులో నిందితుడైన రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడి కళ్ళు ఎప్పుడు పీకుతున్నారు ? దమ్ముంటే పీకీ మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని షర్మిల కేసీఆర్‌కు సవాల్ చేశారు. మహిళల్లో కూడా ఓ చైతన్యం రావాలన్నారు షర్మిల. ఆడవారి రక్షణ కోసం మహిళలంతా కలిసి ముందుకు నడవాలన్నారు.