రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇక నుంచి పాలేరు బిడ్డ అని వైఎస్ షర్మిల అన్నారు. పాలేరు మట్టి సాక్షిగా చెబుతున్నా.. పాలేరు ప్రజల ప్రతీ కష్టంలో, ప్రతీ బాధలో తోడుంటానని చెప్పారు. పాలేరు ప్రజల హక్కుల కోసం..పాలేరు అభివృద్ధి కోసం కొట్లాడుతానని స్పష్టం చేశారు. పాలేరు ప్రజల బంధువునవుతా..బలమైతా..బిడ్డనవుతానని షర్మిల తెలిపారు. గడపగడపకు రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలనను తెచ్చేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. తెలంగాణ ప్రజలకు సేవ చేయాలన్న తపన ఉందన్నారు. సంక్షేమ పాలనకు కేరాఫ్ అడ్రస్ రాజశేఖర్ రెడ్డి అని వైఎస్ షర్మిల అన్నారు. విద్యార్థులకు, వృద్ధులకు, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందించారని గుర్తు చేశారు. ఆరోగ్య శ్రీ ద్వారా ఎంతో మందికి ఉచిత వైద్యం అందించారని చెప్పారు. 5 ఏళ్ల పాటు..46 లక్షల పేదకుటుంబాలకు ఇండ్లు కట్టించారుని తెలిపారు. అసైన్డ్ భూములకు హక్కులు, మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు.
పాలేరుకు కేసీఆర్ ఏం చేశారు
పాలేరు నియోజకవర్గంలో పాలేరు రిజర్వాయర్కు మరమ్మతులు చేసిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డిది అని షర్మిల వెల్లడించారు. నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ ద్వారా పాలేరు రిజర్వాయర్ నింపి.. 2 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చారని తెలిపారు. ఎస్సారెస్పీ ద్వారా సాగునీరిచ్చారని గుర్తు చేశారు. పాలేరు నియోజకవర్గానికి పరిశుద్ధ నీళ్ల పథకం ద్వారా మంచినీరు ఇచ్చారని చెప్పారు. పాలేరులో 20 వేల మంది పేద కుటుంబాలకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇండ్లు కట్టించారన్నారు. పాలేరు నియోజకవర్గంలో కేసీఆర్ ఎన్ని ఎకరాలకు సాగునీరిచ్చారు. ఎన్ని ఇండ్లు కట్టించారని ప్రశ్నించారు.
రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలన రావాలి..
రాష్ట్రంలో మళ్లీ రాజశేఖర్ రెడ్డి పాలన రావాలని వైఎస్ షర్మిల ఆకాంక్షించారు. పాలేరులో ప్రతీ ఒక్కరికి పక్కా ఇళ్లు కట్టే ప్రభుత్వం రావాలి..ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేసే ప్రభుత్వం రావాలి. ఇంట్లో ఎంత మంది ఉంటే అందరికి పింఛన్లు ఇచ్చే ప్రభుత్వం రావాలన్నారు. ఇవన్నీ జరగాలంటే రాజశేఖర్ రెడ్డి పాలన రావాలన్నారు. అందుకే తాను వైఎస్సార్ తెలంగాణ పార్టీ స్థాపించానని వెల్లడించారు.