ఖమ్మం/ వైరా/ కామేపల్లి: సీఎం కేసీఆర్ గత తొమ్మిదేండ్లలో తొమ్మిదిసార్లయినా సెక్రటేరియెట్ కు వెళ్లారా? అని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల ప్రశ్నించారు. పోని సెక్రటేరియెట్కు ఇన్ని హంగు ఆర్భాటాలు ఎందుకని అన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లాలో షర్మిల పర్యటించారు. బోనకల్ మండలం లక్ష్మీపురం, కొణిజర్ల మండలం తుమ్మలపల్లిలో వడగండ్ల వానలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. కామేపల్లి మండలం మద్దులపల్లిలో ఇండ్లు లేక గుడిసెల్లో ఉంటున్న పేదలను కలిశారు. మిగుల్ బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని.. కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని షర్మిల మండిపడ్డారు. రూ.4 లక్షల కోట్ల అప్పు చేసినా, పేదలకు ఇండ్లు మాత్రం కట్టివ్వలేదని ఫైర్ అయ్యారు. ‘‘రాష్ర్టంలో 30 లక్షల మందికి ఇండ్లు లేవు. ఈ తొమ్మిదేండ్లలో 3 లక్షల ఇండ్లు కూడా కట్టలేదు. లక్షన్నర ఇండ్లు కట్టి, అందులో 25 వేల ఇండ్లను మాత్రమే పంపిణీ చేశారు. కేసీఆర్ గొప్పగా చెప్పిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఏవి?” అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదని మండిపడ్డారు. ‘‘లక్షా 20 వేల కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టి, అందులో రూ.70 వేల కోట్లు తిన్నాడు. ఇప్పుడు సెక్రటేరియెట్ కట్టి, అందులో కూడా కమీషన్లు తిన్నాడు. సంక్షేమ పథకాలు అమలు చేస్తే కేసీఆర్ కు కమీషన్లు రావు. అందుకే పథకాలు అమలు చేయడం లేదు” అని విమర్శించారు.
కేసీఆర్.. ఇంకా ఇంటికి పోలేదా?
రైతుల ఖాతాల్లో వేస్తానన్న రూ.10 వేల పరిహారం ఏమైందని కేసీఆర్ ను షర్మిల ప్రశ్నించారు. ‘‘గత నెల 23న ఇదే బోనకల్ మండలానికి కేసీఆర్ వచ్చారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు. ఇంటికి వెళ్లే లోపు నిధులు విడుదల చేస్తానని చెప్పారు. కానీ నెల రోజులైనా పరిహారం రాలేదు. బహుశా కేసీఆర్ ఇంకా ఇంటికి పోలేదు కావొచ్చు” అని విమర్శించారు. ఇది రైతులకు భరోసా ఇచ్చే సర్కార్ కాదు.. రైతులను బర్బాత్ చేసిన సర్కార్ అని మండిపడ్డారు.
షర్మిలకు అస్వస్థత..
కొణిజర్ల మండలం తుమ్మలపల్లిలో రైతులను పరామర్శించిన తర్వాత షర్మిల మీడియాతో మాట్లాడారు. ఆ టైమ్ లో ఆమె స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కళ్లు తిరిగి కింద పడిపోయారు. వడదెబ్బ కారణంగా నీరసంతో సొమ్మసిల్లి పడిపోయారని పార్టీ నేతలు చెప్పారు. కాగా, ఉదయం నేలకొండపల్లి మండలంలో వీరన్నస్వామి జాతర సందర్భంగా షర్మిల అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి రఘునాథపాలెం మండలం ఈర్లపూడిలో బస చేశారు. సోమవారం పాలేరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
-