విశ్లేషణ: కొత్త రాజ్యాంగం దేశానికి కాదు కేసీఆర్ కే అవసరం

సీఎం కేసీఆర్​కి మన రాజ్యాంగం అంటే ఇష్టం లేదు. ఇది ఇప్పుడు పుట్టిన ఆలోచన కాదు. ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని చెప్పుకోవడం కేసీఆర్‌‌‌‌కు ఇష్టం లేదు. ఆయన దయ వల్లే తెలంగాణ వచ్చిందని చెప్పుకోవడానికి కొత్త రాజ్యాంగం అవసరమైంది. తను ఆడిందే ఆట.. పాడిందే పాటగా కొనసాగించటానికి ఈరోజు రాజ్యాంగాన్ని మార్చుకోవాలని ఆయన చూస్తున్నారు. తన పాలనలో ప్రజలు ఇబ్బందులకు గురవుతుంటే.. వారికి రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులతో రక్షణ కల్పించడం ఆయనకు ఎంత మాత్రం ఇష్టం లేదు. ప్రజలను బానిసలుగా చేసి, తను చెప్పిందే వినేలా రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారు. చట్టం ముందు అందరూ సమానులేనని, అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని రాజ్యాంగం చెబుతోంది. ఏ ఒక్కరినీ అంటరానివాళ్లుగా చూడకూడదని కల్పించిందే సమానత్వపు హక్కు. కానీ కేసీఆర్​కు అందరికీ సమాన అవకాశాలు కల్పించడం, అన్ని వర్గాల వారికీ సమాన అవకాశాలు ఇవ్వడం ఇష్టం లేదు. తనకు నచ్చిన వారికి, తన భజన చేసే వారికి అవకాశాలు కల్పించాలంటే.. తన ఇంట్లోనే పదవులు ఇచ్చుకోవాలంటే ఆయన కొత్త రాజ్యాంగం రాయాల్సిందే.

ప్రజలు గొంతెత్తకుండా చేయడానికే..

ప్రతి వ్యక్తి ఇతరులకు ఇబ్బంది కలిగించనంత వరకు సమావేశాలు పెట్టుకోవచ్చు. సంస్థలు, సొసైటీలు స్థాపించుకోవచ్చు. తమ వాక్ స్వాతంత్య్రాన్ని, భావ వ్యక్తీకరణ హక్కును వినియోగించుకోవచ్చు. కానీ కేసీఆర్ కు ప్రజలు సమావేశాలు పెట్టుకోవడం, తనకు వ్యతిరేకంగా గళాన్ని విప్పడం నచ్చదు. కాబట్టి వాళ్లను అణచివేయాలంటే, వారి గొంతు నొక్కేయాలంటే, పోలీసులను తన కార్యకర్తలుగా ఉపయోగించుకొని దాడులు చేయించాలంటే ఆయనకు కొత్త రాజ్యాంగం అవసరం అవుతోంది. ఇప్పుడు ఉన్న రాజ్యాంగం ప్రజలకు దోపిడీ నుంచి, కట్టు బానిసత్వం నుంచి విముక్తి కల్పించి దోపిడీని నివారించే హక్కును ఇస్తే.. దొర పోకడలతో, నిరంకుశత్వంతో పరిపాలించే కేసీఆర్​కు అది నచ్చటం లేదు. ప్రజలు తనకు బానిసలుగా బతికి ఉండాలని, దొరా బాంచన్ కాల్మొక్త అని ఎనకటి దొరల పాలనను తీసుకురావాలని అనుకొంటున్న ఆయన కొత్త రాజ్యాంగం కావాలనుకుంటున్నారు. అన్ని మతాలను సమానంగా గౌరవించడం ఆయనకు ఇష్టం లేదు. ఎన్నికలప్పుడే మతాలను వాడుకొని.. వారికి అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి, వారి ఓట్లను దండుకొని, చివరికి వాళ్లను మోసం చేయాలంటే, వారిని ఓటు బ్యాంకుగానే చూడాలంటే కేసీఆర్‌‌కు తను రాసుకునే రాజ్యాంగం అవసరమే. మతపరంగా ఎవరికీ పన్నులు విధించడం కుదరదు. కానీ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన కేసీఆర్.. బస్ చార్జీలు, పెట్రోల్ చార్జీలు, భూముల ధరలు, ఇంటి పన్నులు, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచుకొంటున్నారు. రేపటి రోజున మతంపై కూడా పన్ను వేయడానికి ఆయన కొత్త రాజ్యాంగం రాస్కోవాల్సిందే.

జనాలు చదువుకోవడం ఇష్టముండదు

ఇప్పుడు ఉన్న రాజ్యాంగం ప్రకారం ప్రతి విద్యార్థికి ప్రాథమిక విద్యను అందించడం ప్రభుత్వ బాధ్యత. వారికి ప్రభుత్వ స్కూళ్లలోనే కాదు, విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ బడుల్లో రిజర్వేషన్ల ప్రకారం పేదలకు సీట్లను కేటాయించాలి. కానీ ఈ రోజు కేసీఆర్‌‌కు విద్యార్థులు చదువుకోవడం ఇష్టం లేదు. ఎందుకంటే వారు చదువుకుంటే ప్రశ్నిస్తారు. ప్రశ్నించడం నచ్చని ఆయన బడులు బందు పెట్టాలంటే, తను ఇచ్చిన గొర్రెలు, బర్లే కాసుకోవాలని అనుకుంటే తన రాజ్యాంగాన్ని రాసుకోవాల్సిందే. తనకు అనుకూలంగా రాజ్యాంగాన్ని మార్చుకోవాల్సిందే. ప్రజలు జీవించడానికి కల్పించిన హక్కులను ప్రభుత్వాలు విస్మరిస్తే.. వాటి రక్షణ కోసం ప్రజలు కోర్టులకుపోవడం కేసీఆర్‌‌కు ఇష్టంలేదు. ప్రజల జీవించే హక్కు పాలకుల చేతుల్లో, దొరల చేతుల్లో ఉండాలంటే వారికి రాజ్యాంగ పరిహార హక్కు ఉండకూడదు. అందుకే కేసీఆర్ తనకు ఇష్టమైన రాజ్యాంగం రాసుకోవాల్సిందే. ఆస్తులను సంపాదించడం, అనుభవించడానికి, అమ్ముకోవటానికి రక్షణగా ఆస్తి హక్కును రాజ్యాంగం కల్పిస్తే.. ప్రభుత్వాలు ప్రజల ఆస్తులను తీసుకుంటే వారికి చట్ట ప్రకారం సరైన నష్టపరిహారం చెల్లించాలి. కానీ కేసీఆర్ తన అనుచరులకు, బంధువులకు ఆస్తులను దోచిపెట్టడానికి, భూములను పంచి పెట్టడానికి, బాధితులకు ఎంత ఇస్తే అంతే తీసుకోవడానికి అనుగుణంగా చట్టాన్ని మార్చుకోవడానికి కొత్త రాజ్యాంగం రాసుకోవాల్సిన అవసరం కచ్చితంగా ఉంది.

రాజ్యాంగాన్ని అవమానించడం కొత్తకాదు 

ప్రతి మనిషి జీవించడానికి రాజ్యాంగం అనేక హక్కులు కల్పించింది. ఆత్మహత్యలు చేసుకోవడం చట్టప్రకారం నేరం. జీవించే హక్కును కల్పించకుండా.. రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వారి చావులను పట్టించుకోవాల్సిన పని లేకుండా చూడటానికి కొత్త రాజ్యాంగం అవసరమే. భారత రాజ్యాంగం నచ్చదు కాబట్టే.. రాజ్యాంగ దినోత్సవం రోజు గవర్నర్ తో కలిసి రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొనలేదు. రాజ్యాంగ పదవిలో ఉండి రాజ్యాంగాన్ని అవమానించిన కేసీఆర్​కు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం నచ్చుతుందని అనుకోవటం లేదు. మీ ఉద్దేశం ఆ రోజే తెలిసింది. రాజ్యాంగాన్ని, కోర్టులను, రాజ్యాంగబద్ధ సంస్థలను కేసీఆర్​ అవమానించడం ఈ రోజు కొత్త కాదు. జీవోలు మార్చినట్టు, అధికారులను మార్చినట్టు .. దేశంలో తెలంగాణ అంతర్భాగం కాదని.. మీ ఇష్టమైన రీతిలో పరిపాలన చేసుకోవడానికి కొత్త రాజ్యాంగం రావాల్సిందే.. దానిని మీరు రాసుకోవాల్సిందే. కొత్త రాజ్యాంగం రాయాలనుకునే మీ పగటి కలలకు పూర్తి స్వేచ్ఛనిస్తూ, మిమ్మల్ని కుర్చీలో నుంచి దించేసి ప్రతిపక్షానికి పరిమితం చేసేందుకు తెలంగాణ ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు. ఇక మీరు ఫాంహౌస్‌‌లో నిశ్చింతగా మీ కొత్త రాజ్యాంగానికి రూపకల్పన చేసుకోవచ్చు.

- దళితులను అణగదొక్కడానికే..

దేశానికి అవసరం ఉందో లేదో తెలియదు కానీ, కేసీఆర్​కు మాత్రం కొత్త రాజ్యాంగంతో చాలా అవసరాలు ఉన్నాయి. ప్రశ్నించే వారిని జైల్లో పెట్టించడానికి.. ఇష్టమొచ్చిన హామీలు ఇచ్చి అమలు చేయకుండా ఉండటానికి.. నచ్చినట్టుగా జీవోలు ఇచ్చుకుని, వాటిని దాచిపెట్టడానికి.. పక్క పార్టీలో గెలిచిన వారిని డబ్బులు పెట్టి కొనేందుకు ఇప్పుడున్న రాజ్యాంగం ఒప్పుకోదు కాబట్టి కొత్త రాజ్యాంగం రాసుకొని గెలిచిన వారిని అర్రాస్ పాట పెట్టి కొనుక్కునే అవకాశం కోసం కొత్త రాజ్యాంగం ఆయనకు అవసరం. రాజ్యాంగబద్ధ పదవి.. ముఖ్యమంత్రి హోదాలో ఉండి.. అన్​పార్లమెంటరీ పదాలు.. బండ బూతులు తిట్టడం వీలు కావట్లేదు కాబట్టి.. బండ బూతులు తిట్టినా కూడా తప్పు కాదనడానికి, తిట్లు తిట్టడం కోసం రాజ్యాంగం రాసుకోవాల్సిందే. దళితులను నిలబెట్టిన రాజ్యాంగం.. దళితులను అణగదొక్కడానికి అడ్డంగా ఉండకుండా చేసేందుకు కొత్త రాజ్యాంగం కావాల్సిందే. బీసీలను సైతం ఓటు బ్యాంకులుగా చూస్తూ.. వారికి అవకాశాలు దక్కకుండా, వారికీ రిజర్వేషన్స్ ఫలితాలు లేకుండా చేయాలంటే.. రిజర్వేషన్స్ ఎత్తివేయాలని.. కులాల మధ్య కుంపటి పెట్టాలంటే.. నడి రోడ్డు మీద లాయర్లను హత్య చేసిన, ప్రశ్నించిన వారిపై ఇసుక లారీలు ఎక్కించి తొక్కించి చంపిన సొంత పార్టీ నాయకులను కాపాడుకోవాలంటే కొత్త రాజ్యాంగం రాసుకోవాల్సిందే.

73 ఏండ్ల భారత రాజ్యాంగాన్ని సీఎం కేసీఆర్ ఎందుకు మార్చాలని అంటున్నారు? దేశ ప్రజలకు సుపరిపాలన, సామాజిక న్యాయం, వాక్ ​స్వాతంత్ర్యం ఇలా ఎన్నో అందించిన రాజ్యాంగాన్ని మార్చాలనడానికి కారణం ఏమిటి? ఏడేండ్లుగా రాష్ట్ర ప్రజలతో పాటు రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యలను అస్సలు పట్టించుకోని కేసీఆర్.. తన చేతగానితనాన్ని దాచిపెట్టుకోవడానికే రాజ్యాంగాన్ని మార్చాలనే వాదనను తెరపైకి తెచ్చారు. తనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పక్కదారి పట్టించడం ద్వారా లబ్ధి పొందాలనేది ఆయన ప్రయత్నం. కానీ, ఎప్పటిలాగే కేసీఆర్ బుట్టలో చిక్కిన ప్రతిపక్షాలు ప్రజా సమస్యలను మర్చిపోయి ఆయన ట్రాప్‌‌లో ఇరుక్కుపోయాయి. వాస్తవానికి కొత్త రాజ్యాంగం అవసరం ఇప్పుడు దేశానికి లేదు. తన వారికి, ఆస్తులకు రక్షణ కల్పించడానికి, పక్క పార్టీల వారిని కొనుగోలు చేయడానికి, ప్రశ్నించిన వారిని జైల్లో పెట్టించడానికి కేసీఆర్​కే దాని అవసరం ఉంది.

వైఎస్ షర్మిల

వైఎస్సార్ టీపీ చీఫ్