నర్సంపేట, వెలుగు: ఉద్యమకారుడని సీఎం కేసీఆర్ కు ప్రజలు అధికారం ఇస్తే.. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండని వైఎస్సార్టీపీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాలు, నిరుద్యోగ భృతి, పోడు భూములకు పట్టాలు, ఉచిత విద్య, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు అంటూ అన్ని వర్గాలనూ మోసం చేసిన కేసీఆర్ ఒక 420 అని విమర్శించారు. షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆదివారం 222వ రోజున 3,500 కిలోమీటర్లు పూర్తయింది. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా నర్సంపేటలోని వైఎస్ఆర్ పార్క్‌లో ఏర్పాటు చేసిన భారీ పైలాన్‌ను తల్లి విజయమ్మతో కలిసి షర్మిల ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో గురిజనులను దత్తత తీసుకుంటానన్న కేసీఆర్ ఇప్పటివరకు ఆ ఊరి ముఖం కూడా చూడలేదన్నారు. నర్సంపేట ప్రాంతంలో రాళ్ల వాన పడి 15 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగితే.. బాధిత రైతులకు నయా పైసా పరిహారం ఇవ్వకపోవడం దారుణమన్నారు. ధరణి పేరుతో రైతులను దగా చేశారని, రుణమాఫీ ముచ్చటే మరిచిపోయారని అన్నారు.
సుదర్శన్ రెడ్డికి కోట్ల ఆస్తులు ఎక్కడివి?
నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డికి కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని షర్మిల ప్రశ్నించారు. నాడు ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేసిన ఆయనను ఉద్యమంలో పాల్గొన్నాడని గెలిపిస్తే.. ఇప్పుడు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. కబ్జాదారులు, డబుల్ రిజిస్ట్రేషన్ల అక్రమార్కులకు అండగా ఉంటున్నారని.. సెటిల్మెంట్లు చేస్తూ కమీషన్లు తీసుకుంటున్నారని, నర్సంపేటలో గ్రీన్ ల్యాండ్స్ ను మాయం చేసింది ఎమ్మెల్యే అనుచరులేనని ఆరోపించారు. మిర్చి పరిశోధన కేంద్రం, ఫుడ్ ప్రాసెస్ యూనిట్ లు పెట్టిస్తానని మాట తప్పారన్నారు.
షర్మిలను దీవించండి: వైఎస్ విజయమ్మ
వైఎస్సార్ ఆశయాల సాధనతో తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం పాదయాత్ర చేస్తున్న షర్మిలకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని వైఎస్ విజయమ్మ విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే షర్మిల పార్టీ పెట్టి పాదయాత్ర చేస్తోందన్నారు. వైఎస్ పథకాలు అమలు కావాలంటే షర్మిలను సీఎం అయ్యేలా దీవించాలని కోరారు.