ఫాంహౌస్ కోసం తండానే ఖాళీ చేయించిండు : షర్మిల

జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన పేరు ముత్తిరెడ్డి.. కబ్జారెడ్డి అని ప్రజలే చెప్తున్నారని ఆరోపించారు. దాదాపు 500 ఎకరాలు కబ్జా చేసిన ఆ కబ్జారెడ్డికి కేసీఆర్ అండగా ఉండడం సిగ్గుచేటన్నారు. ఆయన వ్యవహారంపై ఓ మహిళా ఐఏఎస్ రిపోర్ట్ ఇచ్చారని చెప్పారు. కబ్జాలు చేస్తే ఎవరినీ వదలనన్న సీఎం.. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాల్సింది పోయి రిపోర్ట్ ఇచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ను ట్రాన్స్ఫర్ చేశారని షర్మిల మండిపడ్డారు. కేసీఆర్ కు ఒక ఫామ్ హౌస్ ఉంటే ముత్తిరెడ్డికి మూడు ఫామ్ హౌస్లు ఉన్నాయని, అందులో ఒకదాని కోసం ఏకంగా గిరిజన తండానే ఖాళీ చేయించారని విమర్శించారు. రెవెన్యూ శాఖలో కొలతలు వేసే ఉద్యోగం చేసి అన్నీ లొసుగులు తెలసుకున్న ముత్తిరెడ్డి వాటిని ఉపయోగించి భూములను కబ్జా చేస్తున్నారని షర్మిల ఆరోపించారు.