ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని 100 రోజుల్లో తెరిపిస్తామని చెప్పిన హామీ ఏమయ్యిందని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. బంగారు తెలంగాణలో ఫ్యాక్టరీ మూతపడుతుంటే చూస్తూ ఊరుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ బతికి ఉంటే నిజాం షుగర్స్ ప్రభుత్వపరం అయ్యేదని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రజలకు చేసిందేమీ లేదని కోరుట్ల టౌన్ లో నిర్వహించిన బహిరంగ సభలో షర్మిల అన్నారు. షుగర్ ఫ్యాక్టరీ తెప్పించకపోతే ఉరివేసుకుంటానన్న స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడు ఏమయ్యారని ప్రశ్నించారు. పదవిని అనుభవిస్తున్న వారు ప్రజలను ఎందుకు పట్టించుకోవడం లేదని ఆమె మండిపడ్డారు.
కేసీఆర్ పాలనలో పేదవాడికి గౌరవం లేకుండా పోయిందని షర్మిల వ్యాఖ్యానించారు. వైఎస్సార్ నగరబాట ద్వారా కోరుట్లకు వచ్చారని.. ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా ఉండాలని ఫిల్టర్ బెడ్ కట్టించారని చెప్పారు. ఫిల్టర్ బెడ్ ను ప్రారంభిస్తే వైఎస్సార్ కి పేరు వస్తుందని దానిని ప్రారంభించకుండా వదిలేశారని విమర్శించారు. వైఎస్సార్ హయాంలో పసుపు పచ్చ బంగారం అయ్యిందని చెప్పారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపైనా ఆమె స్పందించారు. మునుగోడులో ఓటు కోసం.. సింపతీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనడం ఏంటి అని వ్యంగ్యంగా మాట్లాడారు. ఎమ్మెల్యే ల కొనుగోలు పై విచారణ జరిపిస్తే అసలు విషయం బయట పడుతుందని షర్మిల స్పష్టం చేశారు.