
జనగామ జిల్లా : రఘునాథ్ పల్లి సబ్ స్టేషన్ ముందు ఉన్న జాతీయ రహదారిపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ధర్నాకు దిగారు. రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్ కోతలను నిరసిస్తూ రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నిరసన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు వెంటనే 24 గంటల పాటు ఉచితంగా కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జై జైవాన్, జై కిసాన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్లోగన్స్ చేశారు. వైఎస్ షర్మిల చేపట్టిన ధర్నాతో వరంగల్, హైదరాబాద్ జాతీయ రహదారిపై పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్డుపై నిలిచిపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నామని కేసీఅర్ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. కరెంట్ కోతలు లేకుండా పాలన సాగిస్తున్నామని అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్దాలు చెప్తున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులేంటో రైతులందరికీ తెలుసన్నారు. -రఘునాథ్ పల్లి మండలంలో పగలు 5 గంటలకు కూడా కరెంట్ ఇవ్వడం లేదన్నారు. చివరకు కరెంటు ఎప్పుడు వస్తుందో విద్యుత్ శాఖ అధికారులకు కూడా తెలియదని వ్యాఖ్యానించారు. ఈ సీజన్ లోనే రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల ఎకరాల్లో వ్యవసాయం సాగవుతోందని, ఈ పరిస్థితుల్లో కరెంటు లేకపోతే పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ధర్నాలు చేస్తుంటే కేసీఆర్ కు మాత్రం కనపడటం లేదని వైఎస్ షర్మిల మండిపడ్డారు. రాష్ట్రంలోనే కరెంటు ఇవ్వని కేసీఆర్.. దేశం మొత్తం ఇస్తాడట అంటూ సెటైర్లు వేశారు. తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో ఇప్పటి వరకూ 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. అనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సబ్సిడీ పథకాలను నిలిపివేశారని అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఏడాది సుమారు వెయ్యి కోట్ల పంట నష్టం జరుగుతోందన్న వైఎస్ షర్మిల.. రైతులకు 24 గంటల పాటు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు తమ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. రైతులకు 24 గంటల పాటు కరెంటు ఇచ్చే వరకూ అన్ని సబ్ స్టేషన్ల ఎదుట ప్రతిరోజూ ఆందోళనలు నిర్వహించాలంటూ పార్టీ శ్రేణులకు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు.