
విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర ప్రభుత్వం రెండు నాలుకల ధోరణి అవలభిస్తోందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్ముతారా లేదా అని ఓ వ్యక్తి సభ్యుడు అడిగిన ప్రశ్నకు.. స్టీల్ ప్లాంట్ అమ్మే నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని డిపార్టుమెంట్‌ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌అండ్ పబ్లిక్ అస్సెట్ మేనేజిమెంట్ సమాధానం ఇచ్చింది. దీనిపై స్పందించిన షర్మిల.. ఎక్స్ వేదికగా కేంద్రంపై విమర్శలు వర్షం గుప్పించారు. ఓవైపు ప్రైవేటీకరణ ప్రశ్నే లేదంటారు. మరోవైపు అమ్మే నిర్ణయంలో మార్పు లేదంటూ లిఖిత పూర్వక సమాధానం ఇస్తారని కేంద్రంపై మండిపడ్డారు. విశాఖ ఉక్కుపై కేంద్ర ప్రభుత్వానిది రెండు నాలుకల ధోరణి అని.. పైకి ఆంధ్రుల హక్కుకు గౌరవం ఉందంటూనే లోపల ప్లాంట్ అమ్మే కుట్రకు ప్రధాని మోడీ ఆజ్యం పోస్తూనే ఉన్నారన్నారు.
రూ.11 వేల కోట్ల ప్యాకేజీ ఇచ్చామంటూనే లోలోపల ప్లాంట్ ప్రాణం తీస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ప్రధాని మోడీది "సైలెంట్ కిల్లింగ్" ఫార్ములా అని ఆరోపించారు. కూటమి ప్రభుత్వానిది పచ్చి మోసమని.. ప్లాంట్‌ను ఉద్ధరించామని చెప్పినవన్నీ ఉత్త మాటలేనని.. అంతా మోసపూరితం. అసత్యపు వాగ్దానాలని విమర్శించారు. విశాఖ ఉక్కుపై ప్రైవేటీకరణ కత్తి ఇంకా వేలాడుతూనే ఉందన్నారు. మోడీ ప్లస్ అదానీ కలిసి.. మోదానీ కంపెనీకి అప్పనంగా కట్టబెట్టాలని చూస్తున్నారని.. విశాఖ ఉక్కును చంపడంలో కర్త మోడీ అయితే ఖర్మ, క్రియ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణే అని తీవ్ర ఆరోపణలు చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకంపై డిపార్టుమెంట్‌ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌అండ్ పబ్లిక్ అస్సెట్ మేనేజిమెంట్‌నుంచి వచ్చిన సమాధానంపై ఏం చెప్తారు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ని కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రశ్నిస్తున్నామన్నారు. నాలుగేళ్ల క్రితం తీసుకున్న నిర్ణయం నేటికి అమలు అనే సమాధానంపై మీ వైఖరి ఏంటి..? ప్లాంట్‌ను ఉద్ధరించేందుకు మోడీ ఇచ్చే అచంచలమైన మద్దతు అంటే ఇదేనా..? ప్రైవేటీకరణ ఆపకపోవడమేనా వికసిత భారత్ - వికసిత ఆంధ్ర..? మీ నిబద్ధత, ఎన్నికల వాగ్ధానం, పోరాట స్ఫూర్తికి నిదర్శనం అంటే ఇదేనా..? కూటమి ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు షర్మిల.
విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై ఇప్పటికైనా మోడీ కుటిల ప్రయత్నాలు మానుకోవాలని.. వెంటనే స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై తక్షణమే అధికారిక ప్రకటన చేయాలని కోరారు. అలాగే.. స్టీల్ ప్లాంట్లో ఉద్యోగులను, కాంట్రాక్టు కార్మికులను కుదిస్తూ తీసుకున్న నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు.