డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో తనిఖీకి వెళ్ళటం ఎంత దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న బోటును సీజ్ చేయాలంటూ పవన్ ఆదేశాలివ్వటం చర్చనీయాంశం అయ్యింది. ఈ అంశంపై స్పందించిన ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల.. పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో పీడీఎస్ బియ్యం విదేశాలకు తరలించడం పెద్ద మాఫియా అని.. ఇదో జాతీయ స్థాయి కుంభకోణమని అన్నారు. పేదల పొట్టకొట్టి రూ. 48 వేల కోట్ల రూపాయల ప్రజల డబ్బును పందికొక్కుల్లా తిని దోపిడీకి పాల్పడ్డారని మండిపడ్డారు. బోట్లు వేసుకొని వెళ్లి హడావుడి చేయకుండా.. నిజాలు నిగ్గు తేల్చాలని చురకలంటించారు షర్మిల.
తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు.. రేషన్ బియ్యం స్మగ్లింగ్ వెనుక ప్రజా ప్రతినిధుల ప్రమేయం ఉందని అన్నారు షర్మిల. కింద నుంచి ఉన్నత స్థాయి వరకు కొంతమంది అవినీతి అధికారుల పాత్ర ఉందని. ఎవరికి దక్కాల్సిన వాట వాళ్లకు చేరుతుండటంతో నిఘా వ్యవస్థ పూర్తిగా కళ్ళుమూసుకుందని ఆరోపించారు.
Also Read : డిసెంబర్ 9 వరకు రాంగోపాల్ వర్మను అరెస్ట్ చేయొద్దు
రాష్ట్రంలో PDS రైస్ విదేశాలకు తరలించడం పెద్ద మాఫియా. ఇదో జాతీయ స్థాయి కుంభకోణం. పేదల పొట్టకొట్టి 48 వేల కోట్ల రూపాయల ప్రజల డబ్బును పందికొక్కుల్లా తినేసిన దోపిడీ. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు.. రేషన్ బియ్యం స్మగ్లింగ్ వెనుక ప్రజా ప్రతినిధుల ప్రమేయం ఉంది. కింద నుంచి ఉన్నత స్థాయి…
— YS Sharmila (@realyssharmila) December 2, 2024
గత మూడేళ్లలో రాష్ట్రంలోని పోర్టుల నుంచి 2 కోట్ల టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా రవాణా అయ్యిందంటే.. మన చెక్ పోస్టుల పని తీరు ఏంటో అంచనా వేయొచ్చని, ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో అర్థం చేసుకోవచ్చని అన్నారు షర్మిల. ఈ కుంభకోణం వెనక ఉన్న నిజాన్ని నిగ్గు తేల్చాలని కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు షర్మిల.