కర్ణుడి చావుకు లక్ష కారణాలు.. పోలవరం విధ్వంసానికి కారకులు వారే.. షర్మిల సంచలన ట్వీట్..

ఏపీలో ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు విషయంలో అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. పోలవరం విధ్వంసానికి మీరంటే.. మీరు కారణమంటూ పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నాయి అధికార ప్రతిపక్షాలు. ఈ క్రమంలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టుపై స్పందించిన షర్మిల ఇటు వైసీపీ, అటు టీడీపీ, బీజేపీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కర్ణుడి చావుకు లక్ష కారణాలన్నట్లు పోలవరం విధ్వంసానికి అసలు కారణం బీజేపీ,టీడీపీ,వైసీపీ పార్టీలే అని అన్నారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా 28లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వటం దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆశయమైతే, పంతాలు పట్టింపులకు పోయి జీవనాడిపై ఇన్నాళ్లు రాజకీయదాడి తప్ప మరొకటి కాదని అన్నారు.

కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్ట్ ను తానే కడతానని చెప్పి పొలవారం,సోమవారం అంటూ హడావిడి తప్పా.. చంద్రబాబు చేసింది శూన్యమని మండిపడ్డారు.రివర్స్ టెండరింగ్ పేరుతో జగన్ అంచనా వ్యయం పెంచడం తప్ప, చేసిందేమి లేదని అన్నారు. ప్రాజెక్టు పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ పిలక ఇప్పుడు చంద్రబాబు చేతిలో ఉందని, శాసించే అధికారం చంద్రబాబుకు ఉంది కాబట్టి పూర్తి స్థాయి నిధులు తెచ్చి,రాష్ట్రంపై ఆర్థిక భారం పడకుండా, పోలవరం పూర్తి చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందంటూ ట్వీట్ చేశారు షర్మిల.