వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా కేంద్రం అడుగులేస్తున్న క్రమంలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. అయితే.. కేంద్రం మాత్రం తగ్గేది లేదంటూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు రంగం సిద్ధం చేస్తోంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలంటూ అటు ఉద్యోగ సంఘాలు, ఇటు విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనను ఉద్దేశించి సంచలన ట్వీట్ చేశారు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ప్రస్తావిస్తూ.. విశాఖ ఉక్కు ముఖ్యమా.. బీజేపీతో పొత్తు ముఖ్యమా తేల్చుకోండి అంటూ.. సీఎం చంద్రబాబుకు సవాల్ విసిరారు షర్మిల.
కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసేందుకు ఢిల్లీకి పయనమవుతున్న@ncbn గారు... విశాఖ స్టీల్ పరిరక్షణపై మీరిచ్చిన హామీని మరోసారి గుర్తు చేస్తున్నాం. ప్రతిపక్ష నేతగా 2021 లో అనాడు మీరు సంతకం చేసి ఇచ్చిన లేఖను మళ్ళీ పంపుతున్నాం. ప్రైవేటీకరణ అడ్డుకుంటానని, ప్లాంట్ పూర్వ వైభవానికి కృషి… pic.twitter.com/6KwLsya7Yz
— YS Sharmila (@realyssharmila) October 6, 2024
ALSO READ | AP News: టీడీపీ ప్రభుత్వంలో ఫైల్స్ కు ఉన్న విలువ మహిళల రక్షణకు లేదా?: మాజీ మంత్రి రోజా
వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ప్రతిపక్ష నేతగా 2021లో చంద్రబాబు సంతకం చేసి ఇచ్చిన లేఖను ఆయనకు పంపారు షర్మిల. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటానని.. అవసరమైతే తమ పార్టీ ఎమ్మెల్యేలంతా రాజీనామాలు కూడా చేస్తారంటూ అప్పట్లో ఈ లేఖలో పేర్కొన్న విషయాన్ని చంద్రబాబుకు గుర్తు చేశారు షర్మిల. మాట మీద నిలబడే తత్వం ఉంటే, అప్పట్లో ఇచ్చిన ఈ లేఖకు విలువ ఉంటే ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను నిలదీయాలంటూ డిమాండ్ చేశారు షర్మిల.