అమరావతి: వైఎస్సార్ కుటుంబంలో ఆస్తి పంపకాల పంచాయితీ పతాక స్థాయికి చేరింది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్, కుమార్తె షర్మిల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ప్రతీ ఇంట్లో ఉండే గొడవలే అని వైసీపీ అధినేత జగన్ చెబుతున్నప్పటికీ.. తల్లి, చెల్లిపై ఇలా కోర్టుకెక్కుతారా అని షర్మిల నిలదీస్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ(అక్టోబర్ 25, 2024) ఈ ఎపిసోడ్ మరో కీలక మలుపు తిరిగింది. జగన్ చేతిలో పేపర్ ఉంది కాబట్టి ఏదైనా నమ్మించగలడని, వైఎస్సార్ అభిమానులకు అసలు వాస్తవాలు తెలియజేసే ప్రయత్నం తనదని షర్మిల 3 పేజీల బహిరంగ లేఖను విడుదల చేశారు. తన అధికారిక ‘ఎక్స్’ అకౌంట్లో ఆ లేఖను పోస్ట్ చేశారు.
ఈరోజు పొద్దున సాక్షి పేపర్ చూశాను. సాక్షి మీడియా జగన్ మోహన్ రెడ్డి గారి చేతిలో ఉంది. కాబట్టి ఏదైనా నమ్మించగలడు. అయినా YSR అభిమానులకు అసలు వాస్తవాలు తెలియజేసే ప్రయత్నం నాది. pic.twitter.com/8ASB8jusrI
— YS Sharmila (@realyssharmila) October 25, 2024
వైఎస్ ఆస్తులు తన అన్న జగన్ సొంతం కాదని, తన తండ్రి వైఎస్ నిర్వహించిన వ్యాపారాలన్నీ కుటుంబ వ్యాపారాలేనని షర్మిల ఈ లేఖలో పేర్కొన్నారు. నలుగురు గ్రాండ్ చిల్ర్డన్స్కు సమాన వాటా ఉండాలని, వైఎస్ కుటుంబ వ్యాపారాలకు జగన్ సంరక్షకుడు మాత్రమేనని షర్మిల తన లేఖలో తెలిపారు. తనకు మనవళ్లు, మనమరాళ్లు సమానమని వైఎస్ అనేవారని, ఆస్తులు సమానంగా పంచిపెట్టడం జగన్ బాధ్యత అనేది షర్మిల వాదన. ఇంకా పలు అంశాలను ఈ లేఖలో వైఎస్ కుమార్తె షర్మిల ప్రస్తావించారు. జగన్ కూడా ఇప్పటికే ఆస్తి వివాదంపై స్పందించిన సంగతి తెలిసిందే. ‘మీ ఇళ్లలో ఇటువంటి కుటుంబ గొడవలు లేవా..? ఇవన్నీ ‘ఘర్ ఘర్ కీ కహానీలు’.. ఇవన్నీ ప్రతీ ఇంట్లో ఉన్న విషయాలే’ అని జగన్ చెప్పారు.
ALSO READ | ఆస్తుల లొల్లిపై జగన్ రియాక్షన్.. షర్మిల కౌంటర్..
జగన్ చేసిన ఈ వ్యాఖ్యలపై షర్మిల ఘాటుగా స్పందించారు. ‘మా ఉద్దేశం కూడా గొడవలను సామరస్యంగా నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాలన్నదే. కానీ ఇది సామాన్యం అంటూనే, అన్ని కుటుంబాల్లో జరిగే విషయం అంటూనే తల్లిని, చెల్లిని కోర్టుకీడ్చారు. ఇది సామాన్యం కాదు జగన్ సార్’ అని షర్మిల మీడియా ముందు వ్యాఖ్యానించారు. అందరి కుటుంబాల్లో అమ్మల మీద, చెల్లెళ్ల మీద కోర్టులో కేసులేసుకుంటారా..? కుటుంబంలో సమస్యలు ఉండటం కామనే. కానీ ఇట్లా అమ్మను కోర్టుకు లాగరు కద’ అని కూడా జగన్కు షర్మిల కౌంటర్ ఇచ్చారు.
అసలు వివాదం ఎక్కడ మొదలైందంటే..
వైఎస్ రాజశేఖర్ రెడ్డి భార్య, జగన్ తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిలపై నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో జగన్ ఫిర్యాదు చేశారు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కంపెనీలో తల్లి విజయమ్మకు తాను గిఫ్ట్ డీడ్‌గా ఇచ్చిన షేర్లను.. తనకు తెలియకుండా షర్మిలకు బదలాయించారని, దీన్ని రద్దు చేయాలని ఎన్సీఎల్టీని కోరారు.