జగన్ కు షర్మిల మూడో లేఖ.. మరో తొమ్మిది ప్రశ్నలు 

ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సీఎం జగన్ కు మరో బహిరంగ లేఖ రాసారు. ఇటీవల ఎస్సీ, ఎస్టీల సమస్యలు, ఉగ్యోగుల సమస్యలపై లేఖలు రాసిన షర్మిల, తాజాగా ధరలు, చార్జీల పెంపుపై మరో లేఖ రాసారు. గత రెండు లేఖల్లో లాగే ఈ లేఖలో కూడా నవసందేహాలు అంటూ తొమ్మిది ప్రశ్నలు సంధించారు షర్మిల. ధరలు, చార్జీల పెంపు వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నా కూడా ఈ ఐదేళ్ళలో ఉపశమన చర్యలు ఒక్కటి కూడా ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు షర్మిల.

రైతులకు గిట్టుబాటు ధరలతో సంబంధం లేకుండా రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పి ఎందుకు చేయలేదని అన్నారు.విద్యుత్ చార్జీలు పెంచబోమని చెప్పి ప్రజల మీద 13వందల కోట్లు భారం ఎందుకు వేశారని అన్నారు. మద్యం మీద 18వందల కోట్లు, ఆర్టీసీ చార్జీల రూపంలో రూ.700కోట్లు, పెట్రోల్, డీజిల్ మీద 500కోట్ల మేర ధరలు పెంచి ప్రజల మీద భారం ఎందుకు మోపారో సమాధానం చెప్పాలని అన్నారు షర్మిల.

యూనివర్సిటీలో ప్రమాణాలు పెంచకుండా ఫీజులు ఎందుకు పెంచారని, ఇసుక ధరను 5రెట్లు పెంచి భావన నిర్మాణ రంగాన్ని దెబ్బతీశారని, 40లక్షల మంది కూలీల ఉపాధిని దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ హయాంలో రేషన్ షాపుల్లో 11నిత్యావసర వస్తువులు ఇచ్చేవారని, ఇప్పుడు బియ్యం తప్ప, పప్పు, చింతపండు, కందిపప్పు, చెక్కెర లాంటివి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు షర్మిల.