
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఎర్రబెల్లి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని.. ఆడవాళ్లయితే మనుషులు కాదా? అన్యాయాలపై మాట్లాడకూడదా అని ప్రశ్నించారు. ఎర్రబెల్లిపై తాము చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నామన్నారు. దమ్ముంటే పబ్లిక్ ఫోరమ్ పెట్టాలని ఎర్రబెల్లికి సవాల్ విసిరారు. ఎర్రబెల్లి సుద్దపూస అయితే ప్రజల మధ్య నిరూపించుకోవాలని అన్నారు.
మహబూబాబాద్ జిల్లా నెళ్లికుదురు మండల కేంద్రంలో మాట్లాడిన షర్మిల ఎర్రబెల్లిపై మాటల తూటాలు పేల్చారు. ‘ పక్క నియోజకవర్గంలో ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నాడు. ఆయన భూ ఆక్రమణల గురించి మాట్లాడితే.. ఆడదానివి అలా మాట్లాడకూడదని అంటున్నాడు. ఆడవాళ్లయితే మాట్లాడకూడదా? ఆడది మనిషి కాదా? ఎర్రబెల్లి ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు. అవుతాపూర్ గ్రామంలో వైఎస్సార్ విగ్రహా ఆవిష్కరణకు వచ్చిన మహిళల లిస్ట్ తీయమని ఎర్రబెల్లి చెప్పారంట. వాళ్లకు పెన్షన్ లు ఆపుతారంట. ప్రభుత్వ పథకాలు ఆపుతారాంట. ఎవడబ్బ సొమ్మనుకుంటున్నావ్ ఎర్రబెల్లి. నీ అబ్బ సొమ్మా. మీ పెత్తనం ఏంటి? మీ జాగీరా?’ అంటూ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.