జగన్ పార్టీకి ఓటు వేయద్దు - వైఎస్ సునీత..!

మాజీ మంత్రి, దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీత సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసు గురించి ఆమె పెట్టిన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ పార్టీకి ఎవరు ఓటు వేయద్దని, వివేకాను హత్య చేసినవారిని జగన్ వెనకేసుకు వస్తున్నారని ఆరోపించారు. తన ప్రెస్ మీట్ కి రాకుండా మీడియాపై కూడా ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. సొంతవారే తన తండ్రిని హత్య చేశారని అన్నారు.

వివేకానందరెడ్డి హత్యకు కారణమైన ఏ ఒక్కరినీ వదిలిపెట్టనని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని, ఒక సీఎం సోదరుడు, మాజీ మంత్రి హత్య కేసులోనే న్యాయం జరగటం ;లేదంటే ఇక సామాన్యులకు పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. వివేకాను గొడ్డలితో చంపినట్లు జగన్ కి ఎలా తెలుసని ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తనను వంచిస్తుందని, జగన్ పార్టీకి ఓటు వేయద్దంటూ ప్రజలను కోరారు సునీత.

ఈ కేసులో నిందితులుగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలను జగన్ సర్కార్ కాపాడుతుందని, సిబిఐ విచారణ సజావుగా సాగనివ్వట్లేదని అన్నారు. రాష్ట్ర ప్రజలను అక్కలు చెల్లెమ్మలు అని పిలిచే జగన్ సొంత చెల్లికి ఎందుకు న్యాయం చేయట్లేదని ప్రశ్నించింది. అసలే షర్మిల కాంగ్రెస్ లో చేరి జగన్ మీద వరుస విమర్శలకు దిగటం వైసీపీని కలవరపెడుతుంటే, ఇప్పుడు సునీత కూడా షర్మిలకు తోడవ్వటం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.