మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ ఎంఆర్.షా, జస్టిస్ నాగరత్నంలతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. సాక్షులను నిందితులు బెదిరిస్తున్నందున తన తండ్రి హత్య కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. ఈ కేసును తెలంగాణకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ సీబీఐ స్పెషల్ కోర్టు కేసును విచారిస్తుందని స్పష్టం చేసింది.
2019 మార్చి 15 న వివేకానందరెడ్డి హత్య జరిగింది. తొలుత గుండెపోటుతో చనిపోయారని వార్తలు వచ్చినా ఆ తర్వాత హత్యగా తేలింది. అయితే కేసు విచారణపై వివేకా కూతురు సునీత అనుమానం వ్యక్తం చేశారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపేందుకు కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.