గుండెలు బాదుకుందురు లెండి..యాత్రని ఆపలేరు..జగనన్న జైత్రయాత్రని ఆపలేరు: YSRCP

వైఎస్ జగన్ రాజకీయ ప్రయాణం..చేసిన పాదయాత్ర నేపథ్యంలో డైరెక్టర్ మహి వి రాఘవ తెరకెక్కించిన మూవీ యాత్ర2(Yatra2). ఈ సినిమా రేపు( ఫిబ్రవరి 8న) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా చూడటానికి రెండు తెలుగు రాష్ట్రాల వైఎస్సార్ అభిమానులు ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అలాగే USA లోఇవాళ ప్రీమియర్ షోస్ పడనున్నాయి.

ఇదిలా ఉంటే..ప్రస్తుతం యాత్ర 2 టికెట్లు అమ్ముడుపోవడం లేదంటూ సోషల్ మీడియాలో ప్రచారం షురూ అయింది. USA లో కనీసం 200 టికెట్లు కూడా అమ్ముడుపోవడం లేదంటూ వస్తోన్న వార్తల్లో..వాస్తవం లేదంటూ YSRCP ట్విట్టర్ వేదికగా స్పందించింది. 

'అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు..తప్పుడు ప్రచారాలతో రాజన్న, జగనన్న స్థాయిని తగ్గించలేరు. అమెరికాలో యాత్ర - 2  సినిమా ఇప్పటికే  పదివేల టిక్కెట్లు అమ్ముడైనట్లు తెలుస్తోంది. రెండ్రోజులు ఆగితే ఆ  సినిమా స్థాయి ఏమిటన్నది అర్థం అవుతుంది అప్పుడు మీరు గుండెలు బాదుకుందురు లెండి. రాజన్న, జగనన్న పట్ల ప్రజలకు ఎంతటి ఆదరణ ఉందన్నది ఈ సినిమా మరోమారు రుజువు చేస్తుంది ఆగండి.

జీవితకాలం తప్పుడు ప్రచారాలతో బతకడమేనా..వాస్తవాలు చూడండి. మీరు యాత్రని ఆపలేరు..మా జగనన్న జైత్రయాత్రని ఆపలేరు' అంటూ YCP వెల్లడించింది. ప్రస్తుతం ఈ న్యూస్ కి సంబంధించిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

యాత్ర2 సినిమా కోసం వెయిట్ చేసే ఆడియన్స్ పెద్ద ఎత్తున ఉన్నారు. ఓ వైపు రాజకీయ నాయకులు..మరో వైపు సినిమా లవర్స్ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. మరి రేపు థియేటర్లోకి రాబోతున్న ఈ సినిమాకి ఎలాంటి ఆదరణ వస్తుందో చూడాలి.