జూలై 8న విజయవాడలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు

  • సోనియా, రాహుల్ హాజరుకానున్నట్టు షర్మిల వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలను ఈ నెల 8న విజయవాడలోని సీకే  కన్వెన్షన్ సెంటర్​లో నిర్వహించనున్నట్టు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వెల్లడించారు. ఈ వేడుకలకు ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ, లోక్​సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్​తో పాటు తెలంగాణ, కర్నాటక, వివిధ రాష్ట్రాల ప్రముఖులు అటెండ్ అవుతారని ఆమె మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఇందులో భాగంగానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర కేబినెట్ మంత్రులను కలిసి ఇన్వైట్ చేసినట్టు చెప్పారు. అంతేకాకుండా సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో వైఎస్ఆర్ కు  అత్యంత సన్నిహితులుగా పేరున్న ఇతర పార్టీ నాయకులను సైతం 75 వ జయంతి వేడుకలకు ఆహ్వానించనున్నట్టు షర్మిల తెలిపారు.

పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి వైఎస్ అభిమానులు పెద్ద ఎత్తున హాజరై మహానేత జ్ఞాపకాలను స్మరించుకోవాలన్నారు. వైఎస్ఆర్ అహర్నిశలూ ప్రేమించి, శ్రమించిన పార్టీకి ఆయన బిడ్డనైన తాను ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నానని.. వేడుకలు జరిపించే అవకాశం తనకు రావటం గొప్ప వరంగా భావిస్తున్నానని షర్మిల పేర్కొన్నారు.