
జనసేన 11వ ఆవిర్భావ సభ శుక్రవారం ( మార్చి 14 ) పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో ఘనంగా నిర్వహించారు. అధికారంలోకి వచ్చాక జనసేన నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ కావడంతో జనసైనికుల దగ్గర నుండి పార్టీ ప్రథమశ్రేణి నాయకుల వరకు ప్రతిష్టాత్మకంగా తీసుకొని సభకు భారీగా తరలివచ్చారు. ఇదిలా ఉండగా జనసేన ఆవిర్భావ సభలో ఏపీ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రస్తావన రావడం ఆసక్తిని సంతరించుకుంది. ఎన్నికల తర్వాత వైసీపీ నుండి జనసేనలో చేరిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి సభలో మాట్లాడుతూ వైఎస్ ప్రస్తావన తెచ్చారు.
తనకు రాజకీయ బిక్ష పెట్టింది వైఎస్సార్ అని బాలినేని అనగానే.. జనసైనికులు పెద్ద అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో తేరుకున్న బాలినేని పూర్తిగా వినండి జనసైనికులకు సర్దిచెప్పాల్సి వచ్చింది. తన ఆస్తుల్లో సగం అమ్ముకున్నానని.. తన ఆస్తులను జగన్ కాజేశారని..త్వరలోనే వివరాలన్నీ బయటపెడతానని సంచలన వ్యాఖ్యలు చేశారు బాలినేని.
పవన్ కళ్యాణ్ ను తాను పదవులు అడగలేదని.. తనతో ఒక్క సినిమా చేయమని అడిగానని అన్నారు. తనతో సినిమా చేస్తానని పవన్ మాట ఇచ్చారని అన్నారు బాలినేని. ప్రాణం ఉన్నంత వరకు జనసేనలోనే ఉంటానని అన్నారు బాలినేని. కాగా... ఎమ్మెల్సీ నాగబాబు మాట్లాడుతూ అధినేత పవన్ కళ్యాణ్ విజయానికి కారణం ఒకటి పవన్ కళ్యాణ్, రెండు పిఠాపురం ఓటర్లు మాత్రమేనని.. పవన్ విజయానికి తామే కారణమని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ ఖర్మ అని అన్నారు. నాగబాబు వ్యాఖ్యలు అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.