189వ రోజు కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర

నిర్మల్ జిల్లా: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన పాదయాత్ర 189వ రోజుకు చేరుకుంది. ప్రజా ప్రస్థానం పేరుతో షర్మిల చేస్తున్న పాదయాత్ర  మంగళవారం నిర్మల్ మండలం కొండాపురం నుండి ప్రారంభమైంది. మామడ గ్రామం వరకు షర్మిల పాదయాత్ర చేయనున్నారు. 

నిర్మల్ జిల్లాలో 4వ రోజు కొనసాగుతున్న షర్మిల పాదయాత్రకు జనం భారీగా హాజరవుతున్నారు. దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ.. పలుకరిస్తూ.. కుశల ప్రశ్నలతోపాటు.. క్షేమ సమాచారాలు.. కష్ట సుఖాలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కష్టాలు ఏకరువు పెట్టిన వారికి కారణాలు వివరించి చెబుతూ.. తాను అండగా ఉంటానని.. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఆశీర్వదించాలని కోరుతున్నారు. 

తాను ప్రభుత్వం ఏర్పాటు చేశాక దివంగత వైఎస్ఆర్ హయాంలో అమలు చేసిన అన్ని సంక్షేమ పథకాలను పునరుద్ధరించడంతోపాటు.. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పేదలందర్నీ ఆదుకునే ప్రయత్నం చేస్తానని షర్మిల భరోసా ఇచ్చారు.