కరీంనగర్ జిల్లాలో కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర

కరీంనగర్ : వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఇవాళ 211వ రోజుకు చేరుకుంది. మానకొండూరు నియోజకవర్గంలోని అలుగునూరు క్యాంప్ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. దారి పొడవునా స్వాగతం చెబుతున్న ప్రజలకు అభివాదం చేస్తూ.. కుశల ప్రశ్నలు, క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకుంటూ వైఎస్ షర్మిల ముందుకు సాగుతున్నారు. ప్రజల సామాజిక, వ్యక్తిగత సమస్యలను అడిగి తెలుసుకుంటూ.. కష్టాలు పడుతున్నామని చెప్పిన వారికి ధైర్యం చెప్పి ఓదారుస్తున్నారు. తాను.. తన పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇస్తున్నారు.

తిమ్మాపూర్ మండల పరిధిలోని ఎల్ఎండీ కాలనీ, మహాత్మనగర్ కాలనీ, తిమ్మాపూర్ మీదుగా మానకొండూరు మండల పరిధిలోని ముంజంపల్లి, మానకొండూరు, ఈదులగట్టుపల్లి మీదుగా పాదయాత్ర కొనసాగనుంది. సాయంత్రం 4గంటలకు మానకొండూరులో జరిగే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర మూడు వేల కిలోమీటర్ల మైలు రాయి దాటినా షర్మిల ఎక్కడా అలసట లేకుండా.. మరింత ఉత్సాహంగా ప్రజలతో మమేకం అవుతూ ముందుకు సాగుతున్నారు.