
అమరావతి: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ గుంటూరు మిర్చియార్డులో రైతులను పరామర్శించారు. అయితే ఈ పర్యటనకు కూటమి సర్కార్ భద్రత కల్పించలేదని వైసీపీ విమర్శించింది. వైసీపీ కార్యకర్తలు, రైతుల మధ్యే జగన్ పర్యటించారు. ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదని, మీరు విపక్షంలో ఉన్నప్పుడు ఇలాగే భద్రత తొలగిస్తే ఎలా ఉంటుందని చంద్రబాబును జగన్ సూటిగా ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతకు భద్రత కూడా ఇవ్వరా అని వైఎస్ జగన్ మీడియా ముందు విస్మయం వ్యక్తం చేశారు. మిర్చి రైతుల ఇబ్బందులు సీఎం చంద్రబాబుకు పట్టడం లేదని, క్వింటాకు ప్రస్తుతం కనీసం రూ.10- నుంచి 12 వేలు కూడా రావడం లేదని జగన్ చెప్పారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 21 వేల రూపాయల నుంచి 27 వేల వరకు మిర్చికి ధర ఉండేదని తెలిపారు.
మిర్చి రైతుల అవస్థలు చంద్రబాబుకు కనిపించడం లేదని జగన్ విమర్శించారు. పంటను అమ్ముకోలేని దుస్థితిలో రైతులు ఉన్నారని, 20 క్వింటాళ్లు దిగుబడి రావాల్సి ఉన్నా 10 నుంచి 15 క్వింటాళ్లు కూడా రాలేదని చెప్పారు. రైతులను చంద్రబాబు దళారీలకు అమ్మేశారని జగన్ తీవ్ర విమర్శ చేశారు. సీఎం చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలని, రైతుల కష్టాలు తెలుసుకోవాలని జగన్ హిత బోధ చేశారు. రైతుల కష్టాలను పట్టించుకోకపోతే రైతుల తరపున ఉద్యమిస్తామని వైసీపీ అధినేత జగన్ కూటమి సర్కార్ను హెచ్చరించారు.