ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికలకు పది రోజులు మాత్రమే సమయం ఉన్న క్రమంలో నేతలంతా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ముమ్మరంగా ప్రచారం చేస్తున్న నేతలు అడపాదడపా అనుచిత వ్యాఖ్యలు చేసి ఈసీ ఆగ్రహానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో పాటు మీడియా సంస్థలపై ఈసీకి ఫిర్యాదు చేసింది వైసీపీ. ఇటీవల జరిగిన పలు బహిరంగ సభల్లో సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై తగిన చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేసారు వైసీపీ నాయకులు మల్లాది విష్ణు.
ఈసీకి ఫిర్యాదు చేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, స్వార్ధ ప్రయోజనాల కోసమే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు సీఎం జగన్ పై చౌకబారు విమర్శలు చేస్తున్నారని అన్నారు మల్లాది విష్ణు. ఓటమి భయంతోనే బాబు, పవన్ లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు విష్ణు. పాలకొండ, విశాఖ సభలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని అన్నారు.
మరోవైపు చంద్రబాబు రాయచోటి సభలో మాట్లాడుతూ జగన్ ను ఉద్దేశించి సైకో అని, బాబాయ్ గొడ్డలి అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం అని అన్నారు విష్ణు. ఈ వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేశామని, తగిన చర్యలు తీసుకోవాలని కోరామని అన్నారు. దీంతో పాటు ఏలూరు అభ్యర్థులపై పలు మీడియా ఛానళ్లలో వచ్చిన కథనాలను పెయిడ్ ఆర్టికల్స్ గా పరిగణించి చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.