ఏపీ ఎన్నికల్లో ఘోర పరాభవం తరువాత వైసీపీలో భారీ ప్రక్షాళనకు పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. పార్టీలో ఉంటూ తెరచాటు రాజకీయాలు నడుపుతున్న వారికి ముగింపు పలకాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే వైఎస్‌ఆర్‌సీపీ అధిష్టానం.. రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేటర్లకు, కౌన్సిలర్లకు విప్ జారీ చేసింది.
సోమవారం(ఫిబ్రవరి 03) ఏపీలో వివిధ ప్రాంతాల్లో డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తిరుపతి, నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్లకు డిప్యూటీ మేయర్లతో పాటు నందిగామ, హిందూపురం, పాలకొండ మునిసిపాలిటీల చైర్‌పర్సన్‌ల కోసం ఎన్నికలు జరగనున్నాయి. అలాగే బుచ్చిరెడ్డిపాళెం, నూజివీడు, తుని, పిడుగు మున్సిపాలిటీలకు వైస్ ఛైర్ పర్సన్స్ ఎన్నిక నిర్వహించనున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో అధిష్టానం.. కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు విప్ జారీ చేయడం ఉత్కంఠ రేపుతోంది. తెరచాటు రాజకీయాల నేపథ్యంలోనే విప్ జారీ చేసినట్లు తెలుస్తోంది. విప్ ధిక్కరిస్తే అనర్హత వేటు వేయనుంది.