ఇంట్లోకి వచ్చి మరీ.. వైసీపీ నేతను నరికి చంపారు

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో  ఓ రాజకీయ నేత దారుణ హత్యకు గురయ్యాడు.  వైసీపీ నేత, రాజమండ్రి మాజీ కార్పొరేటర్ బూరాడ భవానీ శంకర్‌ను దుండగులు దారుణంగా హతమార్చారు. భోజనం చేసి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నప్పడు ఎవరూ లేని సమయం చూసిన దుండగులు ... లోపలికి ప్రవేశించి కత్తులతో విచక్షణా రహితంగా పొడిచారు. తీవ్రగాయాలపాలైన శంకర్‌ను హుటాహుటిన రాజమండ్రిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు స్థానికులు, కుటుంబ సభ్యులు. అయితే పొట్ట, ఛాతీ, మెడపై తీవ్రగాయాలైనట్లు  వైద్యులు తెలిపారు.  ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు శంకర్‌.

శంకర్ శరీరంపై గాయాలు 

సమాచారం అందుకున్న  త్రీ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ... ఈ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.. భవానీ శంకర్‌ పై దాడి చేయడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.శంకర్‌ ఒంటిపై పలుచోట్ల గాయాలను గుర్తించారు పోలీసులు..  హత్య వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయా? లేదా వ్యక్తిగత వ్యవహారాలే హత్యకు దారి తీశాయా? అనే విషయం తేల్చే పనిలో పడిపోయారు త్రీటౌన్‌ పోలీసులు. పాత కక్షల కారణంగా ఈ హత్య జరిగి వుంటుందని పోలీసులు భావిస్తున్నారు..  మృతుడు  భవానీ శంకర్ గతంలో 48వ డివిజన్ కార్పొరేటర్‌గా పనిచేశారు. వైపీపీలో కీలకంగా వున్న ఆయన ప్రస్తుతం గడప గడపకు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. భవానీ శంకర్ మరణం పట్ల పలువురు వైసీపీ నేతలు సంతాపం తెలిపారు.