అల్లు అర్జున్‌ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నా..: వైఎస్ జగన్‌

అల్లు అర్జున్‌ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నా..: వైఎస్ జగన్‌

అల్లు అర్జున్‌ అరెస్టుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించారు.  అల్లు అర్జున్‌ అరెస్టును తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వైఎస్ జగన్ అన్నారు. తొక్కిసలాట ఘటనలో మహిళ ప్రాణాలు కోల్పోవడం బాధకార విషయం అయినప్పటికీ, ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ అల్లు అర్జున్ బాధ్యతగా నడుచుకున్న విషయాన్ని జగన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు.  

"హైదరాబాద్‌ సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం  తీర్చలేనిది. ఈ ఘటనపై అల్లు అర్జున్ విచారం వ్యక్తం చేసి, ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించారు. అటువంటి అతన్ని ఈ ఘటనకు నేరుగా బాధ్యుడ్ని చేయడం ఎంతవరకు సమంజసం? తొక్కిసలాట ఘటనలో తన ప్రమేయం లేకపోయినా అర్జున్‌పై క్రిమినల్‌ కేసులు బనాయించి, అరెస్టు చేయడం సమ్మతం కాదు. అల్లు అర్జున్‌ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను.." అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.

మరోవైపు, ఈ కేసులో నాంపల్లి కోర్టు.. అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. దాంతో, పోలీసులు అతన్ని చంచల్ గూడ జైలుకు తరలిస్తున్నారు.